కళంకితులపై ఎందుకు ఉపేక్ష?

ప్రజాధనాన్ని కొల్లగొట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయుడు జగన్‌కు లాభం చేకూర్చేందుకు జారీచేసిన జీవోల విషయంలో మంత్రులకు ప్రమేయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వేదికగా గట్టిగా వాదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రులకు నిజంగానే సంబంధం లేనప్పుడు ఆ జీవోలను రద్దు చేయాలి. ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ఇవి జగన్‌ కుటుంబానికి మాత్రమే లాభం చేకూరుస్తాన్నాయని ప్రకటించాలి. అవినీతిని సహించబోమంటున్న సీఎం మంత్రులను వెనకేసుకుని వచ్చే ముందు ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ధైర్యాన్ని ప్రదర్శించాలి. రాజకీయ లాభాపేక్ష లేకుండా చూసుకోవాలి. అప్పుడే సీఎం నిజాయితీని శంకించాల్సిన అవసరం రాదు. కానీ ఇవేవీ చేయకుండా ఆ మంత్రులకు సంబంధం లేదంటే మచ్చ మాసిపోదు. సీతఎం ఢిల్లీ పర్యటనలో ఈ విషయాలను చర్చించకుండా కేవలం పార్టీ వ్యవహారాలను చూసుకోవడం వల్ల ఇమేజ్‌ పెరగదు. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ పెద్దలు ఆరా తీస్తున్నా ఎందుకనో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.  కిరణ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు చేస్తున్న ఫిర్యాదులు కూడా ఆజాద్‌, సోనియా వద్ద చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినప్పటికీ తాను అందరినీ కలుపుకొనిపోయేందుకే ప్రయత్నిస్తున్నానని సీఎం వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగి ఉండవచ్చు. కానీ ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో మంత్రుల అవినీతి అతిపెద్ద సమస్య కాబోతున్నది. దీనిని ఎలా నెగ్గుకు రావాలన్న దానిపై ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. సిఎం బిజీబిజీగా ఢిల్లీలో గడిపినా ఈ వ్యవహారాన్ని దాటవేయలేదరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కిరణ్‌కుమార్‌డ్డి హస్తిన పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఆశావహ పరిస్థితిని కల్పించి ఉంటుందనడంలో సందేహం లేదు. లాగే తమ పక్షాన గట్టిగా మాట్లాడినందుకు  కళంకిత మంత్రులు కూడా సంతసించి ఉంటారు. కళంకిత మంత్రుల వ్యవహారం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పార్టీ సంస్థాగత వ్యవహారాలను ఒక కొలిక్కి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రయత్నించారని సమచారం. అయితే  ఇవేవీ ప్రస్తుతానికి పరిష్కారం కాలేదనే భావించాలి. కేంద్రంలో ఆరోపణలు వచ్చిన ఇద్దరు మంత్రులను తొలగించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను, తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రులను తప్పించేందుకు కిరణ్‌కు స్వేచ్ఛ లభిస్తుందని భావించినా ఈ విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాలేదని అర్థం చేసుకోవచ్చు. కనీసం ముగ్గురు మంత్రులపై వేటు ఖాయమని ప్రచారం జరిగినా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారందరినీ కేబినెట్‌నుంచి తొలగిస్తే జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళన కాంగ్రెస్‌ శ్రేణుల్లో కూడా ఉంది. జీవోల జారీలో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రుల ప్రమేయం తక్కువని, లబ్ధిదారులు వేరేవారని, మంత్రివర్గ తీర్మానం మేరకే ఆనాడు జీవోలు జారీ అయ్యాయని చర్చ జరిగిందని తెలిసింది. వాటికి మంత్రులను వ్యక్తిగతంగా బాధ్యులు చేయడంలో ఔచిత్యం లేదని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెబుతున్నారు. కళంకిత మంత్రులపై వేటు వేయాల్సిందేనని రాష్ట్ర పార్టీ నేతలే డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కొందరికి ఉద్వాసన తప్పదని, ఈ నెల 23న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకుని, కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఈ మేరకు రాజ్‌భవన్‌తో సంప్రదింపులు జరిగాయని కూడా ప్రచారమైంది. అయితే అదంతా ఉత్తదే అని అర్థం చేసుకుంటే మంచిది.  ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సలహాలు, సూచనలకే పరిమితమయ్యారని, నిర్ణయాల జోలికి వెళ్లలేదని అంటున్నారు.  ముఖ్యమంత్రిపై ధిక్కారస్వరంతో వ్యవహరిస్తున్న మంత్రుల తీరు ఈ పర్యటనలో అధిష్ఠానం పెద్దల వద్ద ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఖాళీగా ఉన్న అన్ని పదవులను భర్తీ చేయడం ద్వారా క్యాడర్‌ను ఉత్సాహపర్చాలని, రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని అధినేత్రి నుంచి ముఖ్యమంత్రికి హావిూ దక్కి ఉంటుంది.  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని, కనుక వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు సూచనలు అందాయని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఎంతకాలం వరకు ఆదుకుంటాయన్నది ఇక్కడ గమనించాలి. ఒకవేళ స్థానిక ఎన్నికలల్లో ప్రతికూల ఫళితాలు వస్తే ఏం సమాధానం చెబుతారు. అందరినీ తనవారిగా చేసుకుని ఎన్నికల  సంవత్సరం కావడంతో పార్టీని సమర్థంగా నడిపి.. ప్రభుత్వంలోనూ సమన్వయం సాధించి.. అందరినీ కలుపుకొని పోవాలని సీఎం ఆశిస్తూ ఉండడంలో తప్పులేదు. కానీ ఎంతకాలం ఇలా దాటవేస్తారన్నదే ప్రశ్న. మొత్తంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత ఇప్పటికిప్పుడు రాష్ట్ర పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదని అర్థం అవుతుంది. అయితే అవినీతిని అంతమొందిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి మూలమైన జీవోలు జారీ చేసిన మంత్రులను ఉపేక్షించడంలో ఆంతర్యమేమిటో  ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.