కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

కడప, జూలై 19: ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో వెంటనే కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో శంకర్‌ మాట్లాడుతూ నగరంలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో చిన్న వర్షానికే నీరు చేరుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జయనగర్‌ ఉన్నత పాఠశాల చిన్నపాటి వర్షానికే జలమయం కావడం జరుగుతుందన్నారు. ఈ పాఠశాలలోకి వెళ్లాలంటే విద్యార్థుల బట్టలు తడవాల్సిందేనని అన్నారు. ఈ పాఠశాల దుస్థితి అధికార యంత్రాంగానికి తెలిసినా ఇప్పటివరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఉందని వివరించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.