కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతోందని అన్నారు. మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని, వర్షాలతో జిల్లాల్లోచెరువులు నిండాయన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడంలో వేగం పెంచాలని అన్నారు. వర్షాలతో పరిస్తితులు అనుకూలంగా ఉన్నందున దీనిని ఉపయోగించుకోవాలన్నారు. గతేడాది జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఇటీవల మంత్రి జూపల్లి  పర్యవేక్షించారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలుపెరిగి చెరువుల నిండాయని,  నిండిన చెరువులను చూస్తే సంతోషంగా ఉందన్నారు.   ప్రాజెక్టులు కట్టనీయకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, కోర్టుకు వెళ్తూ రైతులను రెచ్చగొడుతూ ప్రాజెక్టులు కట్టనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, షాదీముభారక్‌, కల్యాణలక్ష్మీ, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని దుయ్యబట్టారు. వీరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలన్నారు.