కవ్వాల్‌కాడ పులుల జాడ

1
– చిగురిస్తున్న ఆశలు

ఆదిలాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో నిర్వహించిన జంతుగణనలో పులుల జాడ కనిపించలేదని ప్రకటించారు.  అయితే చిరుతల జాడ మాత్రం కనిపించింది. కవ్వాల్‌లో పులుల అభయారణ్యం పెట్టినా దానికి సంబంధించి పులుల సంచారం లేదు.  జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలోని జన్నారం, ఇంధన్‌పల్లి, తాళ్లపేట, బీర్సాయిపేట రేంజీ పరిధిలో జంతుగణన చేపట్టారు. అటవీ ప్రాంతంలో  సిబ్బంది జంతువుల వివరాలను సేకరించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పెద్దపులి సంచరిస్తున్నట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదనిఅప్పట్లో  పేర్కొన్నారు. చిరుతపులులు 10, ఎలుగుబంట్లు 48, రేచుకుక్కలు 77, తోడేళ్లు 7, నక్కలు 20, అడవి పిల్లులు 05, అడవి దున్నలు 149 ఉన్నట్లు  చెప్పారు.  అయితే వాతావరణం పులులకు అలవాటు పడితే ఇక్కడకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ దశలో తాజాగా పులిసంచారం ఇప్పుఉడ అటవీ అధికారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మామడ-కొరటికల్ఱ్‌ మార్గంలో గురువారం సాయంత్రం కనిపించిన పులి మళ్లీ ఎటు వెళ్లిందో తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అటవీసిబ్బంది ప్రయత్నించారు. పులి అడుగు జాడలను చూస్తూ వెళ్లగా చందారం నుంచి నల్దుర్తి తురక చెరువుకు వెళ్లినట్లు కనుగొన్నారు. చెరువు ప్రాంతంలో పాదముద్రలు పడ్డ చోట పచ్చిగా ఉండటంతో అది ఖచ్చితంగా శుక్రవారం ఆ మార్గంలో వెళ్లినట్లు అటవీ అధికారులు అంచనా వేశారు. అటు నుంచి దిమ్మదుర్తి అడవిలోకి వెళ్లిందని భావిస్తున్నారు.  అటవీ అధికారులు,సిబ్బంది రోజంతా అడుగులను వెతుక్కుంటూ ముందుకెళ్లారు. పులుల పాదముద్రల సేకరణలో నైపుణ్యం ఉన్న వారు ముద్రలను పకడ్బందీగా సేకరించారు. నల్దుర్తి అటవీ ప్రాంతంలో, చెరువు సవిూపంలో పులి సంచరిస్తే తెలుసు కునేందుకు సీసీ కెమెరాలను అమర్చారు. ఇక ఖానాపూర్‌  మండలంలోని ఎక్బాల్‌పూర్‌ శివారులో కన్పించిన పెద్దపులి గురువారం మామడ మండలం కొరిటికల్‌లో ఓ యువకుడిని గాయపర్చిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే పులి పడుకొన్నట్లు కన్పించిందని కొందరు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అప్రమత్తమైన అటవీఅధికారులు  సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చీకటి ఉండడంతో తిరిగి వచ్చామని, తమకు ప్రస్తుతానికి ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని, మళ్లీ ఉదయం ఆ పరిసరాల్లో పులి అడుగుజాడలను పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు. మొత్తంగా పులజాడలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.