కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు. మరో సివిలియన్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. సైనిక అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికల గురించి మంగళవారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. శివగఢ్- అసర్ బెల్ట్ లో నలుగురు టెర్రరిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో సైనిక బలగాలు ఆ ఏరియాలో గాలింపు చేపట్టాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలను గమనించి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం రాత్రి మొదలైన ఎదురుకాల్పులు బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, మరణించిన కెప్టెన్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడ్డ సివిలియన్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోందని, ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించామని తెలిపారు. అప్పటికే అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయారని చెప్పారు. ఆ స్థావరంలో పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ రైఫిల్ కూడా ఉందని పేర్కొన్నారు.