కశ్మీర్‌పై అమెరికా ట్రెంపరితనం!
కశ్మీర్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యల కారణంగా మరోమారు రచ్చ చోటు చేసుకోవడం మంచిదే. ఎందు కంటే ఎప్పటికప్పుడు కాశ్మీర్ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాగే ఈ సమస్య ఎలా వచ్చిందో..దీనికి కారణమెవరో కూడా నేటి ప్రజాప్రతినిధులు సవివరంగా తెలుసుకోవాల్సిందే. పార్లమెంట్ ఉభయసభల్లో ట్రంప్ వ్యాఖ్యలపై దుమారం లేపి రాజకీయ పబ్బం గడుపుకునే పద్దతిలో నేతలు మాట్లాడారే తప్ప కాశ్మీర్‌పై చిత్తశుద్దితో కాదన్నది ప్రపంచానికి తెలుసు. కాశ్మీర్ సమస్య కావచ్చు…దేశ విభజన కావచ్చు… ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారం కావచ్చు.. అన్నింటికీ కారణం స్వాతంత్య్రం తెచ్చానని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ పార్టీదే అని మరోమారు మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ దూరదృష్టి లోపం, భవిష్యత్ దర్శనం లేకపోవడం కారణంగా దేశాన్ని ముక్కలు చేసేందుకు ఆనాడు ఒప్పుకుంది. కాశ్మీర్ విషయంలో పరిష్కారనికి అందివచ్చిన అన్ని అవకాశాలను తుంగలో తొక్కింది. అధికారమే పరమావధిగా నెహ్రూ నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేయని పాపం లేదు. ఈ దేశాన్ని సకల దరిద్రాల్లోకి నెట్టేసిన కాంగ్రెస్‌ను ఎంతగా దునుమాడినా తప్పులేదు. ఇకపోతే తాజా వివాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల పై చర్చించాల్సిందే. ఎందుకంటే ట్రంప్ అదేపనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎక్కువగా ఇష్ట పడతారు. ఇతర దేశాల్లో వేలు పెట్టడం ఆయనకు సరదా. వివిధదేశాలతో ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అంతర్జాతీయ పరిస్థితులు అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇరాన్, చైనా, జపాన్, రష్యా,కొరియాలతో ఇటీవల ఆయన వ్యవహారశైలి ప్రపంచ ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. ఆయన ట్రెంపరితనాన్ని పార్లమెంట్ గట్టిగా ఖండించేలా విపక్షాలు చర్చించి ఉంటే బాగుండేది. ట్రంప్ మన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు గట్టిగా చివాట్లు పెట్టి ఉంటే ప్రజలు హర్షించే వారు. కానీ విపక్షాలకు కావాల్సింది అదికాదు. ట్రంప్ వ్యాఖ్యల ఆధారంగా మోడీని దునుమాడాలి. అందుకే ఈ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో హంగామా సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి వాషింగ్టన్‌లో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహించాల్సింది పోయి ఆయన వ్యాఖ్యల ద్వారా మోడీ సభకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే అసలు సమస్య ఏంటన్నది చర్చించి ఉంటే బాగుండేది. ఇటీవల జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ నన్ను కలిశారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అడిగారని, ఉభయ దేశాలు కోరితే నేను అందుకు సిద్ధం అని, నేను ఏదైనా సాయం చేయగలనంటే చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. విషయం తెలియగానే భారత్‌లో రగడ మొదలైంది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ప్రధాని కోరడం అనుచితమని, దీనికి మోదీ సమాధానం చెప్పాల్సిందేనని పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు పట్టు బట్టాయి. దీంతో విపక్షాల ఆరోపణలను ఖండిస్తూ విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ తో ఉన్న వివాదాలన్నింటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృఢమైన వైఖరినే తమ ప్రభుత్వమూ కొనసాగిస్తుందని అందులో స్పష్టం చేసింది. అయితే దీనికి విపక్షాలు సంతృప్తి చెందలేదు. ట్రంప్‌తో ఏం మాట్లాడారన్నది ప్రధాని మోదీయే జాతికి స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిజానికి ఈ వ్యవహారంపై రగడ జరుగుతున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలపై స్వయంగా అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది ద్వైపాక్షిక అంశమని, దీనిలో తాము తలదూర్చమని తేల్చింది. మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్‌ను మోదీ అసలు అడగనే లేదని,కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యానికి తావులేద ని విదేశాంగ మంత్రి స్పష్టం చేశాక కూడా విపక్షాలు గొడవ చేయడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించి
రాజకీయ ఎజెండాతో ముందుకు సాగాయి. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని మోదీ అసలు ట్రంప్‌ను అడగనే లేదని విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ సమాధానమిచ్చినా విపక్షాలు శాంతించలేదు సరికదా ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని అనడం ద్వారా సమస్యను చర్చించే అవకాశం కోల్పోయారు. నిజానికి కాశ్మీర్ సమస్యపై చర్చిస్తే కాంగ్రెస్ బండారం బయట పడుతుంది. దేశస్వాతంత్య్రం మొదలు, దేశ విభజన, కాశ్మీర్ దురాక్రమణ వరకు అనేక విషయాలు బయటకు వస్తాయి. ఇక ఇక్కడ మరో విషయం గమనించాలి. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు విూర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ స్వాగతించారు. కశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే తమ చిరకాల అభిమతమన్నారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఉభయ దేశాలు ఈ మధ్యవర్తిత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబూ ముఫ్తి అన్నారు. కశ్మీర్ వివాద పరిష్కారం కోసం ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం కోరడం స్వాగతించదగిన విషయమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించేందుకు మోదీ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమంటూ ఆయన్ను అభినందించేల మాట్లాడారు. భారత్, పాక్ శత్రుత్వాన్ని పక్కనపెట్టాల్సిన సమయం వచ్చేసిందన్నారు. నిజానికి ఇది కూడా పూర్తిగా రాజకీయ స్వలాభంతో కూడిన ప్రకటనగానే చూడాలి. వీరికి భారతదేశం కన్నా పాక్ హితమే ముఖ్యం. కాశ్మీర్‌లో నిత్యం నరమేధం సాగుతున్నా పట్టింపులేని ఏలికలు వీరు. ఈ సమస్యపై రాజీలేని కఠిన వైకరి అవలంబించడం మినహా భారత్‌కు మరో మార్గం లేదు. అక్కడ శాంతికి విఘాతం కలిగిస్తున్న విదేశీ ఉగ్రమూకలను ఏరిపారేయడం మినహా మారో మార్గం లేదు. కాశ్మీర్‌ను నిత్యం రావణకాస్టంగా మారుస్తున్న ఉగ్రమూకలకు గట్టిగా బుద్ది చెప్పడం ద్వారా శాంతికి పునాది వేయాలి. అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం గడిపేలా చేయాలి.