కశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ అఖిలపక్ష సమావేశం

3brk-Rajnathదిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ పర్యటనకు ముందు శనివారం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. కశ్మీర్‌ పరిస్థితులపై, పర్యటన విధి విధానాలపై వారికి అవగాహన కల్పించారు. అధికారుల కథనం ప్రకారం.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌, పీఎంవో సహాయ మంత్రి జితేంద్రసింగ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కశ్మీర్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితుల గురించి, ఆ పరిస్థితులపై వివిధ వర్గాల ప్రజలు, నేతలు, వివిధ పార్టీలు, గ్రూపులు, వ్యక్తుల అభిప్రాయాల గురించి పార్లమెంటు సభ్యులకు వివరించారు. రేపు మొదలయ్యే రెండు రోజుల పర్యటనలో ఎంపీలు ఎవరెవరితో మాట్లాడాలన్న విషయంపై చర్చించారు. పర్యటనలో పాల్గొనే ప్రతినిధి బృందమంతా ఏకాభిప్రాయంతో ఉండేందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 4, 5 తేదీలలో అఖిల పక్ష బృందం కశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో కనీసం 28మంది పార్లమెంటు సభ్యులు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు పాల్గొంటున్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, అంబికాసోనీ, మల్లికార్జున్‌ ఖర్గే, జేడీయూ నేత శరద్‌యాదవ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఎన్సీపీ తరఫున తారిఖ్‌ అన్వర్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ నేత సౌగతారాయ్‌, శివసేన నేతలు సంజయ్‌ రౌత్‌, ఆనందరావు అద్సుల్‌, తెదేపా నుంచి తోట నర్సింహం, తెరాస నుంచి జితేందర్‌ రెడ్డి, వైకాపా నుంచి వై.బి. సుబ్బారెడ్డి.. తదితరులు పర్యటనలో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రులతో ప్రతినిధి బృందం చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.