కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : రంజాన్‌ మాసం ముగియడంతో జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల విరమణకు కేంద్రం స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కశ్మీర్‌లో సైన్యం తిరిగి మొదలుపెట్టింది. బందిపొరలో తీవ్రవాదులు ఉన్నట్టు సోమవారం ఉదయం సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో సైన్యం వెంటనే అప్రమత్తమైంది. వారిపై ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నట్టు సైన్యం అనుమానిస్తోంది. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. కేంద్రం ప్రకటనతో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట మొదలుపెట్టింది. లోయలోని శ్రీనగర్‌ సహా అన్ని ప్రాంతాల్లో ముష్కరుల కోసం జల్లెడ్‌ పడుతున్నారు. అనుమానిత కదలికలను సైతం వదలకుండా పూర్తి నిఘా ఉంచారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరమే నగరంలోకి వాటిని అనుమతిస్తున్నారు. రంజాన్‌ సందర్భంగా సైన్యం కాల్పుల విరమణ పాటించినా ఉగ్రవాదులు మాత్రం హింసను విడిచిపెట్టలేదు. గత వారం శ్రీనగర్‌ పరిసర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. గురువారం సాయంత్రం సీనియర్‌ జర్నలిస్ట్‌ షుజాత్‌ బుఖారీని కాల్చి చంపగా, రాష్టీయ్ర రైఫిల్స్‌కు చెందిన ఔరంగజేబు అనే జవాన్‌ను అపహరించి హతమార్చారు. శుక్రవారం నాడు పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంపై దాడిచేసిన ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో గురువారం ఉదయం సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు.