కశ్మీర్ జర్నలిస్టు బుఖారిని చంపింది వీళ్లే..

శ్రీనగర్‌:జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌, రైజింగ్‌ కశ్మీర్‌ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్‌ సయ్యద్‌ షుజాత్‌ బుఖారిఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఈ కేసుకు సంబంధించి సీసీటీవీలో రికార్డయిన ముగ్గురు అనుమానితుల ఫొటోను కశ్మీర్‌ పోలీసులు తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి అర్ధరాత్రి సమయంలో బైక్‌పై వెళ్తూ కన్పించారు. వీరి గురించి వివరాలు తెలిస్తే చెప్పాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. నిందితుల ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

కశ్మీర్‌ లోయలో శాంతిని నెలకొల్పేందుకు గత మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుజాత్‌ బుఖారీ నిన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన కార్యాలయం నుంచి ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యేందుకు ఆయన బయటకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుఖారీ వ్యక్తిగత భద్రత అధికారి కూడా మృతిచెందారు. కాగా మరో పోలీసు, ఒక పౌరుడు గాయపడ్డారు. 2000 సంవత్సరంలోనూ ఆయనపై దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయనకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు.

బుఖారీ మృతి పట్ల కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బుఖారీ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

కాగా.. బుఖారీ మృతిచెందినప్పటికీ నేడు రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ప్రచురితమైంది. ముఖ చిత్రంలో బుఖారీ ఫొటోను నలుపు తెలుపు రంగుల్లో వేసి రైజింగ్‌ ఖశ్మీర్‌ సిబ్బంది ఆయనకు నివాళులర్పించారు.