కశ్మీర్ లో పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలి

A view of the Indian Supreme Court building is seen in New Delhi

కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలని, అన్ని సమస్యలనూ న్యాయపరంగా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్ లో పరిస్థితి అధ్వానంగా ఉందని, అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన విధించాలని కోరుతూ జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీనేత, సీనియర్ న్యాయవాది భీం సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితికి అనేక కోణాలున్నాయి. వాటన్నింటినీ రాజకీయంగానే పరిష్కరించాలి. అన్ని సమస్యలకూ న్యాయపరమైన పరిష్కారం కోసం అన్వేషించడం సరికాదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో విపక్ష నేతలు ప్రధానితో భేటీ అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. మీరు కూడా ఆ బృందంలో సభ్యులుగా చేరాలని ధర్మాసనం భీం సింగ్ కు సూచించింది. దీనికి భీం సింగ్ స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేతృత్వంలో నడిచే ప్రభుత్వం తనను ఆహ్వానించలేదన్నారు. దీంతో.. ఇక్కడ రాజకీయ ప్రకటనలు చేయవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భీం సింగ్ కు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం కల్పించేందుకు సాయపడాలని సొలిసిటర్ జనరల్ రంజితకుమార్ కు సూచించింది. ఈ కేసు విచారణలో భాగంగా జమ్మూకశ్మీర్ పరిస్థితిపై కేంద్రం స్థాయీ నివేదికను ధర్మాసనానికి అందజేసిందని, దానిపై భీంసింగ్ స్పందనను కోర్టుకు తెలపాలని ధర్మాసనం సూచించింది.