కాంగ్రెస్ను చీల్చేందుకు కేజ్రీవాల్ కుట్ర?

కాంగ్రెస్ను చీల్చేందుకు కేజ్రీవాల్ కుట్ర?
 న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నింటిలాగే.. ఆ తానుముక్కేనని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. అందులోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనేసి, తద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలని గతంలో అరవింద్ కేజ్రీవాల్ భావించారట. దీనికి సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ బయటపెట్టారు. ఇటీవలి ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మెజారిటీ సాధించకపోవడం.. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో అప్పట్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన విషయం తెలిసిందే.

అయితే.. ఎటూ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి కష్టాలు ఉంటాయని, అందుకే కాంగ్రెస్ పార్టీలో కొందరిని కొనేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించినట్లు గార్గ్ బయటపెట్టిన ఆడియో టేపుల్లో ఉంది. కానీ ఈ పథకం ఫలించలేదు.. అంతలోనే సర్కారు రాజీనామా చేసింది. పదవిని కాపాడుకోడానికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఇలాంటి ప్రయత్నాలకు సంబంధించి తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని గార్గ్ అన్నారు. దమ్ముంటే ఢిల్లీ సీఎం తన సచ్ఛశీలతను నిరూపించుకోవాలని సవాలుచేశారు.

కాగా.. ఈ పరిణామాల కారణంగా పార్టీని వీడుతున్నట్టు మహారాష్ట్ర పార్టీ సీనియర్ లీడర్ అంజలి దమాని ప్రకటించారు. నేను ఆయన్ని నమ్మాను.  ఆయన సిద్ధాంతాలకు మద్దతిచ్చాను తప్ప.. ఆయన రాజకీయ బేరసారాలకు కాదంటూ ఆమె ట్వీట్ చేశారు.