కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ బంపర్‌ ఆఫర్‌

తెలంగాణ ఇచ్చేయండి.. టీఆర్‌ఎస్‌ను కలుపుకోండి
విలీనానికి కేసీఆర్‌ సై అన్నారు : కేకే
హైద్రాబాద్‌, అక్టోబర్‌31(జనంసాక్షి): కాంగ్రెస్‌ కు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ అధినేత కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన పక్షంలో తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.. ఈమేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు మీడియతో వెల్లడించారు. కేసీఆర్‌ బుధవారం కేశవరావు నివాసంలో ఆయన్ను కలుసుకు న్నారు. 3గంటలకుపైగా కేశవరావుతో చర్చలు జరిపారు. అయితే కేసీఆర్‌ మీడియాతో మాట్లాడటానికి ముందుకురాలేదు. భేటీ అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వచ్చిన ఊహగానాల్లో వాస్తవంలేదన్నారు. తెలంగాణ సాధించటానికి ఏ పార్టీతోనైనా పనిచేసేందుకు తాను సిద్దమన్నారు. టీఆర్‌ఎస్‌ విలీనం ప్రతిపాదనను గమనంలోకి తీసుకుని కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. నవంబర్‌21న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని కేకే విజ్ఞప్తి చేసారు అయితే కాంగ్రెస్‌ అధిష్టానం తీరు పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అధక్షుడు ఆగ్రహంతో ఉన్నట్ల్లు తెలుస్తోంది.