కాంగ్రెస్‌ను కాపాడటం.. ఎవరి వల్లాకాదు

 

– సోనియా సభతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైంది

– తెరాస గెలుపు అనివార్యంగా ప్రజలు భావిస్తున్నారు

– ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే రెండు మూడు సీట్లు కూడా రాకుండా పోయాయని టీఆర్‌ఎస్‌ నేత, ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం సూర్యాపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఆంధ్ర ప్రదేశ్‌లో తనకు రాజకీయ ప్రయోజనం జరగడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి కాంగ్రెస్‌ నేతలను వాడుకుంటున్నారని, ఇక తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని కాపాడటం, రాష్ట్ర ఇంచార్టీలు, రాహుల్‌ గాంధీల వల్లే కాలేదని, చివరి ఆశగా తీసుకువచ్చిన సోనియా గాంధీ వల్ల కూడా అవలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం నాటి మేడ్చల్‌ సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా, ఉద్యోగుల విభజన, విద్యుత్‌ వాటాలను, చివరికి హైకోర్టు విభజనను కూడా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబును స్కిప్ట్‌న్రు సోనియా గాంధీ ఫాలో అయ్యారని, తెలంగాణాలో ఏమి చెబితే పార్టీకి మంచి జరుగుతుందో కూడా తెలియని నాయకత్వం, నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు

వందకుపైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ సభల్లో ఆంధప్రదేశ్‌కు హావిూలు ఇవ్వడాన్ని తప్పు పడుతూ కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలంగాణ పట్ల ప్రజలు అదరాభిమానాలు కలిగి ఉన్నారని అన్నారు. నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అన్ని వర్గాలప్రజలకు, రైతులకు, దళితులకు, ముస్లీంలకు ఇలా ధనిక, బేధా, మతం, కులం తారతమ్యం లేకుండా కేసీఆర్‌ వారి అభివృద్ధి కోసం అద్భుత పథకాలను అమలు చేశారని అన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనను చూసి ప్రజలు నాలుగేళ్ల తెరాస పాలనతో సంతోషంగా ఉన్నారని అన్నారు. మళ్లీ తెరాస పాలనతోనే, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని పేద వర్గాల ప్రజలు భావిస్తున్నారని, డిసెంబర్‌ 11 తరువాత మళ్లీ కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని జగదీశ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెరాస నేతలు పాల్గొన్నారు.