కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి: డికె

మహబూబ్‌నగర్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని గుర్తుంచుకోవాలన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్‌ ముందుకు రాకుంటే కెసిఆర్‌ సిఎం అయ్యేవారు కాదన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కెటిఆర్‌ ఎక్కడుండేవారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఏం చేయకుంటే విూరెక్కడ ఉండేవారో ఆలోచించాలన్నారు. ఇలాంటి విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. ప్రస్తుతం అంతటా కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటుచేసిన నీటి పథకాలు, పైపులైన్లే ఉన్నాయని, అన్ని ఇళ్లకు నల్లాలు ఉన్నాయని తెలిపారు. మిషన్‌ భగీరథ కింద ప్రజలకు చేసింది ఏముందని ప్రశ్నించారు. ప్రజలు తాగటానికి, అవసరాలకు నీరు డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, సమస్యను పరిష్కరించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు. తమ పార్టీ పాలనలో చేపట్టిన రామన్‌పాడు పథకం ద్వారా నీటిని అందించవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథను ఎక్కుగా చెప్పుకొంటూ ప్రచారం చేయటం తప్ప.. ప్రజల ఒరిగిందేవిూ లేదని పేర్కొన్నారు. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ గురించి చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరుపై ఉన్న ధ్యాస ప్రజల సమస్య పరిష్కారంపై లేదని విమర్శించారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు నీళ్లు వద్దా అని ప్రశ్నించారు.