కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పెరుగుతున్న క్యూ


చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి
కూటమితో చాలమందికి భంగపాటు తప్పదేమో
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీల్లోనూ భారీగానే ఉంది. అయితే మహాకూటమి కారణంగా కాంగ్రెస్‌లో టిక్కటెల్‌ఉ అశిస్తున్న వారికి కొన్నిచోట్ల భంగపాటు తప్పేలా లేదు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎవరికి వాళ్లుగా గ్రూపులు విడిపోయి ప్రచారాన్ని సాగిస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీనికితోడు కూటమి పొత్తు కారణంగా టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితికికూడా టిక్కెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ వ్వయహారం కారణంగా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తప్పవని భావిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మూడుముక్కలాట నడుస్తోంది. మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండేలు ఎవరికి వాళ్లు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. రామచంద్రారెడ్డి వయసురీత్యా పెద్దవాడు కావడంతో ఆయనకు చెక్‌ పెట్టాలని చాలమంది అంటున్నారు. అయితే బలగం ఉన్న వ్యక్తి కావడంతో అది అంత ఈజీ కాదని భావిస్తున్నారు. దీంతో  ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ వస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. ముగ్గురు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరోపక్క ఆ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ సైతం మైనార్టీ కోటాలో టిక్కెట్టు ఇవ్వాలని అగ్రనేతలను కలుస్తున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాల్లోనూ పార్టీ ఆధినేతలు టికెట్లపై భరోసా కల్పిస్తూ సీనియర్లకే అవకాశం ఉంటుందని బలంగా చెప్పారు. పార్టీ బలోపేతానికి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అంతా భావించారు. దీంతో గ్రూపులుగా విడిపోయినా.. ఎవరికివాళ్లు ప్రజల మధ్యకెళ్లి తమ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలు హడావుడిగా కాంగ్రెస్‌లో చేరుతుండటంపై సీనియర్లు మండిపడుతున్నారు. తెరాస నేతల ఒత్తిళ్లను తట్టుకుంటూ పార్టీ కోసం సమయాన్ని వెచ్చించడంతో పాటు సొంతంగా డబ్బు ఖర్చు చేసి ప్రతిపక్ష ¬దాలో ప్రజాసమస్యల పై పోరాటం చేసిన తమను గుర్తించకపోతే పరిణామాలు  తీవ్రంగా ఉంటాయని అంటున్నారు.  తెరాస తరఫున ఖానాపూర్‌ అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డ రాఠోడ్‌ రమేష్‌ తనకున్న రాజకీయ ప్రాబల్యం మేరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలతో టికెట్‌ హావిూ పొంది పార్టీలో చేరారు. ఆయన
కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతల్లో అసమ్మతిని రాజేసింది. తెరాస అభ్యర్థి రేఖానాయక్‌పై పోటీ చేయడానికి కాంగ్రెస్‌లో నలుగురైదుగురు అభ్యర్థులు రెండు మూడేళ్లుగా టికెట్లపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇదివరకే రెండుమార్లు పోటీచేసిన హరినాయక్‌ మరోమారు ఆశలు పెట్టుకోగా ఇదే నియోజకవర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు భరత్‌చౌహాన్‌ కొన్నినెలలుగా విస్తృతంగా పర్యటిస్తు టిక్కెట్టుకోసం పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో రమేష్‌చేరడంతో అధిష్ఠానం తీరుపై వారు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు చారులత రాఠోడ్‌, భుక్యా జానకిలను ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్పించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.  సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమ్‌రావు తనయుడు హరిశ్‌బాబు అనుచరుల తో కలిసి కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ నియోజకవర్గ ఆశావహులు మాత్రం ఈ పరిణామంతో కంగుతిన్నారు.  ముథోల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నారాయణ్‌ రావు పటేల్‌, వరుసకు ఆయనకు సోదరుడయ్యే రామారావు పటేళ్ల మధ్య టికెట్‌ కోసం గట్టిపోటీ నెలకొంది.
వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్‌ వస్తుందని ఆశతో ఉన్నారు. ఇదే తరుణంలో తెరాస నుంచి ఎన్‌ఆర్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇక్కడ రాజకీయ సవిూకరణాలు ఏవిధంగా మారనున్నాయో అనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలోనూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గందరగోళానికి దారి తీస్తున్నాయి. అప్పటికే ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంజీవరావు పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు. ఆ తర్వాత తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్‌ కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరే నియోజకవర్గంలో వేర్వేరు గ్రూపులుగానే విడిపోయి ప్రచారం చేసుకుంటు న్నారు. తాజాగా ఆబ్కారీశాఖలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసిన బోర్లకుంట వెంకటేశ్‌ నేత నెల రోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. టికెట్‌ తనకు ఇచ్చే ఒప్పందంతోనే పార్టీలో చేరినట్లు ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడంతో మిగిలిన ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది. బోథ్‌ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు మొదటినుంచి పోటీపడుతున్నారు. రెండుమార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన అనిల్‌జాదవ్‌ పార్టీ కార్యక్రమాలతో విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళుతు మరో మారు టిక్కెట్టు ఆశిస్తుండగా పోయినసారి ఎంపీగా పోటీచేసిన ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌జాదవ్‌ సైతం అసెంబ్లీ టిక్కెట్టుపై కన్నేసి దిల్లీ పెద్దల ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరిద్దరి కాదని తెదేపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు తనకు టికెట్‌ ఖాయం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆదివాసీల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయంబాపురావు తనకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పు కొంటున్నారు. ఆయనకే టిక్కెట్టు వస్తుందని ప్రచారంతో ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న సీనియర్లు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు. పాత వాళ్లను పక్కనపెట్టి కొత్తవాళ్లను అందలం ఎక్కిస్తే సహించేది లేదని గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన అనిల్‌ జాదవ్‌ వర్గీయులు చెబుతున్నారు.  మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రేం సాగర్‌రావుకే టికెట్‌ ఖరారైందనే ప్రచారం జరుగుతున్నా.. అరవిందరెడ్డి కూడా టికెట్‌కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌పార్టీలో చేరడానికి కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు.