కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు


టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన
భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి
ఆదిలాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. ఎంపీ టికెట్‌ను రాథోడ్‌ రమేశ్‌కు ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు టిక్కెట్‌ ఆశించి భంగపడ్డనేతలను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వీరంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. ఇదంతా తమకు మరింతగా కలసి వస్తుందిన అధికార టిఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు లేకపోవడం, కాంగ్రెస్‌ కలహాల కారణంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు సునాయయాసంగా మారిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గ కలహాలు ఎలా ఉన్నా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎంపి, ప్రస్తుత ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్‌ వేణుగోపాలచారి వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా కాంగ్రెస్‌ తరహా రాజకీయాలపై విసుగుచెందారని అన్నారు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిలో ఎంపీ టికెట్‌ కేటాయింపు విషయలో వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. పార్టీ నిర్ణయించిన ఎంపీ అభ్యర్థికి ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది సందేహంగా మారింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన హస్తం పార్టీకి ప్రజల మద్దతు లేకుండా పోయిందని చారి అన్నారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి ముగ్గురు నాయకులు టికెట్‌కోసం ప్రయత్నాలు చేశారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్‌ జాదవ్‌, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓడిపోయిన రాథోడ్‌ రమేశ్‌, బోథ్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సోయం బాపురావులు టికెట్‌ పై ఆశలు పెట్టుకున్నారు. ముగ్గురు నాయకులు తమకు దగ్గరగా ఉన్న అధిష్టానం పెద్దల ద్వారా తీవ్ర
ప్రయత్నాలు చేశారు.  ఎంతోకాలంగా తాను పార్టీకి సేవచేస్తున్నానని ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం తనకు టికెట్‌ ఇవ్వాలని గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటి చేసి ఓడిపోయిన నరేశ్‌ జాదవ్‌ ఏఐసీసీ నేతలను కోరారు. హస్తం పార్టీ తరపున రాథోడ్‌ రమేశ్‌, సోయం బాపురావుల పేర్లను పరిశీలించడం ఏంటని ఆయన కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. తనకే ఎంపీ టికెట్‌ ఇవ్వాలని నాయకులను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ లోకసభకు పోటీచేసే ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రాథోడ్‌ రమేశ్‌ పేరు ఉంది. దీంతో పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన నరేశ్‌ జాదవ్‌, సోయం బాపురావులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. బహిరంగంగానే విమర్వలుచేశారు. దీంతో వీరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఎంపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో నరేశ్‌ జాదవ్‌ హస్తం పార్టీకి రాజీనామా చేసారు. టికెట్‌ దక్కని మరో నాయకుడు సోయం బాపురావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హస్తం పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌కు మరో వర్గం నాయకులు, కార్యకర్తల మద్దతు సందేహంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమ నాయకులకు అధిష్టానం ఎంపీ టికెట్‌ కేటాయించక పోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో రాథోడ్‌కు మద్దతు లభించడం కష్టమనే భావన ఉంది. దీనికితోడు టిఆర్‌ఎస్‌ ఇప్పుడు మరింత బలంగా ఉంది.