కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకే..  ముందస్తుకెళ్లాం


– 58ఏళ్ల పాలన ఒకవైపు, నాలుగేళ్ల పాలన ఒకవైపుంది
– రెండింటికీ బేరీజు వేసుకొని ఓటేయండి
– హైదరాబాద్‌ను కట్టానంటున్న బాబు.. 24గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదు?
– కేంద్రం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం మూడో గ్రేడ్‌ పథకం
– ఆరోగ్యశ్రీతో పోల్చితే 20శాతం మాత్రమే ఉంటుంది
– తొందరపడి తెలంగాణను మళ్లీ కాకులు, గద్దలకు అప్పగించొద్దు
– కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌
అదిలాబాద్‌, నవంబర్‌29(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డగోలు విమర్శలు పడలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడుతూ..  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవద్దనే ఎన్నికలకు వెళ్లామని ఆయన స్పష్ఠం చేశారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌-టీడీపీలు ఒకవైపు… నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. వాళ్ల పాలనలో కరెంట్‌ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వగలుతున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కట్టానంటున్న చంద్రబాబు కరెంట్‌ ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యల మధ్య అద్భుత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని కేసీఆర్‌ విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ మూడో గ్రేడ్‌ పథకమని, తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీతో పోల్చితే 20శాతం మాత్రమే ఉంటుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అవినీతిని అరికట్టి సంపద పెంచుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గుడుంబా బట్టీలు లేవని, పేకాట క్లబ్బులు లేవని అన్నారు. తెలంగాణను మళ్లీ కాకులు, గద్దలకు అప్పగించొద్దని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు. సిర్పూర్‌లో పరిశ్రమల మూతకు కారకులెవరో విూకు తెలుసునని అన్నారు. కేంద్రం, పక్క రాష్ట్రం సతాయించినా పైకి వచ్చామని అన్నారు. గెలవాల్సింది పార్టీలు కాదని… ప్రజలని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వందేళ్లు వెనక్కివెళ్తామని, కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీకి గులాములని కేసీఆర్‌ విమర్శించారు. నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరారు. కంటి వెలుగు దేశంలో ఎక్కడైనా అమలు అవుతుందా అని ప్రశ్న లేవనెత్తారు. బీజేపీ వాళ్లు ఊరికే వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ తాలూకా మొత్తం తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. రైతులు పండించిన పంటలు, పండ్లు, కూరగాయలు ఎక్కడో అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా తాలూకాకి రెండు మూడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్టీల్రు పెడతామని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ బ్రతికున్నంత వరకు ఈ స్కీములు అన్నీ కొనసాగుతాయని చెప్పారు.