కాంగ్రెస్‌ కసరత్తు కొలిక్కి వచ్చేనా

దసరా నాటికి పేర్లు ఖరారుపై నేతల ఎదురుచూపు
హైదరాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలనప్పటికీ… అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒకవైపు పొత్తుల అంశంపై చర్చలు జరుపుతూనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీ బీజీగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితర హేమాహేవిూలు నియోజకవర్గాల నుంచి వచ్చిన ఆశావహుల దరఖాస్తులను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు, వివాదాస్పదం కాని నియోజకవర్గాలు మినహా మిగతా వాటిపై తొలుత దృష్టి పెట్టారు. టిడిప, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు కోరుతున్న సీట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో తొలుత తమ పార్టీలో ఉన్న ఆశావహుల పేర్లను పరిశీలించారు.  ఆశావహులు ఎక్కువగా
ఉన్న చోట ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు పేర్లను సెంట్రల్‌ స్కీన్రింగ్‌ కమిటీకి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం సెంట్రల్‌ స్కీన్రింగ్‌ కమిటీ నేతలు భక్తచరణ్‌దాస్‌, షర్మిష్ట ముఖర్జీ స్క్రీనింగ్‌ కమిటీ నేతలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి సీట్లు దక్కుతాయనేది సస్పెన్స్‌గా మారింది. ఇకపోతే /ూష్ట్రంలో ఐదుగురు మాజీ ఎంపీలను అసెంబ్లీకి పంపాలని కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారిలో ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రమేష్‌ రాథోడ్‌ ఒకరు. ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ రమేష్‌ రాథోడ్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. రేఖానాయక్‌ను ఎదుర్కొనేందుకు రాథోడ్‌ సరైన అభ్యర్థిగా ఎన్నికల కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఖానాపూర్‌ సీటు కోసమే పోటీ తీవ్రంగా ఉంది. దాదాపు అన్ని  నియోజకవర్గాల్లో కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటున్నా… ఆయా స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వివిధ సవిూకరణాలను బేరీజు వేసుకొని టికెట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరాలోపే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు ఇటీవల పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అయితే ఎన్నికలకు రెండు నెలల గడువు ఉండడం, వచ్చే నెలలో నోటిఫికేషన్‌ విడుదలవడం వంటి పరిణామాల నేపథ్యంలో దసరాలోపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందా అనేది అనుమానమేనని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌ టికెట్లకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో నేతల్లో జోష్‌ కనిపిస్తోంది.