కాంగ్రెస్ కుట్ర రాజకీయాలుమానాలి
ప్రాజెక్టుల పూర్తితో మారనున్న తెలంగాణచిత్రం
విప్ గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి,మే21(జనం సాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులను ఆదరించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవృత్తులు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పారు. చెరువులు ధ్వంసం అయ్యాయని అన్నారు. గ్రామాలలోని కులవృత్తుల వారికి పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నాడని అన్నారు. గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణమవుతే ఇక్కడి ప్రాంత సాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతయన్నారు.
ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయితే రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని, కాని దీనిని ఒర్వలేని కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిపై కావాలని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సాగునీటి ప్రాజెక్టులు కట్టితీరుతామని వెల్లడించారు. కానీ వాటిని గుర్తించి స్వరాష్ట్రంలోని ప్రజలు కష్టాలు పడవద్దని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సదుద్దేశ్యంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే కులవృత్తులకు ఆదరణ లభిస్తుందని సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రైతులకు గొర్రెలతో పాటు గడ్డి విత్తనాలను కూడ మంజూరు చేయించడం గతంలో ఎప్పుడైనా చూశామా అని అన్నారు. స్వరాష్ట్రంలో గొర్లకాపరులు ఇబ్బందులు ఎదుర్కొవద్దని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం లబ్ధి చేకూరుతుందని ఆకాంక్షించారు. లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తి పాదరర్శకంగా జరుగుతుందని చెప్పారు. సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుడికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. రెండు విడతలలో భాగంగా ఈ పథకం లబ్ధిచేకూరనున్నట్లు తెలిపారు.
బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడ అతి త్వరలోనే పూర్తి అవనున్నట్లు చెప్పారు. రైతులు సాగునీరు కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన వెంటనే నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలంతా కులాలు, పార్టీలకతీతంగా ముందుకుసాగుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.