కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు..  అధికారమే పరమావది


– అమలుకాని హావిూలతో రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి
– హావిూలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు బహిరంగ చర్చకు సిద్ధమా?
– ఆరెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
– విలేకరుల సమావేశంలో బీజేపీ నేత కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : హావిూలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమలు సాధ్యం కాని హావిూలిస్తూ ఆ రెండు పార్టీలు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వీరి హావిూలు చూస్తుంటే రాష్ట్రన్ని ఆర్థికంగా అదోగతి పాలు చేసేలా ఉన్నాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో లక్ష 70 వేల కోట్లు అప్పులు కేసీఆర్‌ తెచ్చారని అన్నారు. రోడ్లకు డబ్బులు లేవు, ఫీరియింబర్స్‌ మెంట్‌ చెల్లించడం లేదు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది, ఒక్క కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం లేదు, విద్యుత్‌ శాఖ అప్పుల మయం అయిందని అన్నారు. అదేవిధంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మద్యానికి బానిసై ఎన్ని వేల మంది చనిపోయారో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రెండు పనులు పెట్టుకొందని, ఒకటి అప్పు చేయడం, రెండోది మద్యాన్ని అమ్మడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2017నాటికి హైదరాబాద్‌ నగరంలో లక్ష ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగనన్నారని.. ఇప్పుడేమైందని కిషన్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పై ప్రజలకు నమ్మకం లేదని, ప్రజల పైన కాంగ్రెస్‌ కి నమ్మకం లేదని అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణలో ఎన్నికల హావిూలతో సాధ్యంకాని కూటమిలతో దింపుడుకళ్లం ఆశతో ఉందన్నారు. హావిూల అమలులో ఎందుకు విపలమయ్యారో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  హావిూలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్‌ చేశారు. ఓట్లు, సీట్లు, అధికారం తప్ప ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధిలేదన్నారు. బిజెపి వంట చేసి పెట్టే పార్టీ కాదని, వంట ఎలా చేయాలో నేర్పించే పార్టీ అని ఆ పార్టీ నేత కిషన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు మోడీ ఇంటినుంచి ఇస్తున్నారా అని టిఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. మరి టిఆర్‌ఎస్‌ హావిూలను శ్రమదానం చేసి అమలు చేస్తారా అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.