కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ అభివృద్ది కనిపించదు


యాదవుల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమయ్యింది
సిద్దిపేటలో మంత్రి హరీష్‌ రావు
సిద్దిపేట,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కన్పించడంలేదని, వారంతా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. యాదవుల ఆత్మీయసభకు హరీష్‌రావు హాజరై మాట్లాడుతూ యాదవులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారన్నారు. యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్‌ను కర్ణాటక మంత్రి రేవణ్‌ ప్రశంసించారని చెప్పారు. యాదవులకు రూ.6వేల కోట్లతో గొర్రె పిల్లలను పంపిణీ చేశామన్నారు. పదవుల్లోనూ యాదవులకు ప్రాధాన్యత కల్పించామని గుర్తుచేశారు. పట్టణ యాదవులకూ గొర్రెలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గొల్ల కురుమల గురించి ఆలోచించిన తొలి వ్యక్తి కేసీఆరేనని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని, అది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతుల కోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చిన సీఎం కేసీఆర్‌ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పంటలకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరితే స్పందన లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 12 వందల కోట్ల రూపాయలను కేటాయించి పంటలకు గిట్టుబాటు ధరను అందించిందని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ పాలకులు.. తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణలోని ఏడు మండలాలు, సీలేరు దిగువ విద్యుత్తు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించి తీరని అన్యాయం చేశారన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడంతో పరిశ్రమలు లాభాల బాటలో నడుస్తున్నాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఎవ రూ విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు అన్నీ కష్టాలేనని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతు కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయని చెప్పారు.