కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీల కొట్లాట

వారికి ప్రజలకన్నా పదవులే ముఖ్యం
కెసిఆర్‌కేమో రైతు బాధలు ముఖ్యం
అందుకే రైతుబంధుతో చెక్కుల పంపిణీ
కాంగ్రెస్‌ తీరుపై మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా
మెదక్‌,మే15(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ పార్టీలో అప్పుడే కుర్చీల కొట్లాట జరుగుతోందని భారీ నీటిపారుదల శాఖ మంతి హరీశ్‌రావు విమర్శించారు. ఆలులేదు..చూలు లేదన్న చందంగా కాంగ్రెస్‌ లో ఎవరు సిఎం అన్న చర్చ సాగుతోందని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవడమెలా అని సిఎం కెసిఆర్‌ ఆలోచన చేస్తుంటే వాళ్లేమో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారని అన్నారు. మంగళవారం నర్సాపూర్‌లో రైతుబంధు పథకం చెక్కులు, పాసు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతుల శ్రేయస్సు కోసమే రైతుబంధు పథకమని మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కర్ణాకటలో బీజేపీ నకలు కొట్టిందని అన్నారు. అందుకే అక్కడ బిజెపికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. కెసిఆర్‌ పథకాలు దేశం మొత్తంగా అమలు చేసే పరిస్థితి రానుందన్నారు. /ూష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాల అమలుపై కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పొంతనలేని ఆరోపణలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. 70 ఏండ్ల కేంద్ర, రాష్ట్ర పాలనలో ప్రజలు లేరా? ఉన్నా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం చేతకాలేదా అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులకు కడుపుమండి తెలంగాణ సర్కార్‌ చేస్తున్న అభివృద్ధి పనులపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పక్కరాష్ట్రం కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పాలనలో ఉన్నాయని, అక్కడి ప్రజలకు ఒక విధానం, తెలంగాణ ప్రజలకు మరొక విధానంతో కాంగ్రెస్‌ పార్టీ కాలం గడుపుతుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీని వచ్చే ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ప్రజలు ప్రోత్సాహం అందించి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రైతులకు రూ.12వేల కోట్ల పెట్టుబడులను ప్రతి సంవత్సరం కొనసాగించి ఆదుకుంటామని స్పష్టం చేశారు.   తెలంగాణ సర్కార్‌ నిర్ణయం, చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీతో అన్నదాతల జీవితాల్లో రైతుబంధు పథకం భరోసా నింపిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రత్యేకంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయమన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే తమ సవిూప బ్యాంకు ఖాతాలలో నగదు పొందవచ్చన్నారు. ఇందుకోసం ముందుగానే బ్యాంకులకు నిధులు ఆర్బీఐ సమకూర్చిందని ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలితమేనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపడుచులు బిందెలు పట్టుకుని రోడ్లపైకి రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ మరో వినూత్నమైన పథకం మిషన్‌ భగీరథను త్వరలో ప్రారంభించి ప్రతి ఇంటికీ నల్లాతో తాగునీళ్లు సరాఫరా చేస్తామన్నారు. భూ సమస్యలను శాస్వతంగా పరిష్కరించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి పట్టాభూములు, అటవీ, అసైన్డ్‌, శిఖం, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ భూములన్నింటి వివరాలు తేటతెల్లం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందన్నారు. భూముల క్రయవిక్రయాలలో అమ్మేవారు, కొనేవారు రికార్డుల బదలాయింపులు కూడా తమ ఎదుటనే నిర్వహించి రిజిస్టేష్రన్‌ విధానాన్ని
తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించి నిలదీసి అలజడి సృష్టిస్తున్నారని మంత్రి వివరించారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో 24 గంటల కరెంట్‌ను చూసిన ప్లలెవాసులకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా 24 గంటలు మెరుగైన కరెంట్‌ సరఫరా చేస్తున్న ఘనత ప్రభుత్వానికే ఉందన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో దొంగలు పడ్డ చందంగా అర్థరాత్రి సమయంలో మూడు గంటల చొప్పున షిప్టుల వారిగా కరెంట్‌ సరఫరా చేసి సాగుకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
అంతేకాకుండా ప్రసవ వేదనలతో ప్రైవేట్‌ దవాఖానలకు పరుగులు పెట్టి ఆర్థికంగా నష్టపోయిన మహిళలకు సుఖ ప్రసవాలు చేసేందుకు ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపర్చిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌కే దక్కిందన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేల నగదు సహాయంతో పాటు తల్లీబిడ్డ క్షేమానికి అమ్మ ఒడి పథకంతో కేసీఆర్‌ కిట్టును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి తదితరులు పాల్గొన్నారు.