.కాంగ్రెస్ పార్టీ నుంచి సిరిసిల్ల రాజయ్య సస్పెన్షన్
హైదరాబాద్ నవంబర్ 8 (జనంసాక్షి):
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఇటీవలే రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైన సంగతి తెలిసిందే.
రాజయ్య కుటుంబంతో ఉన్న మనస్పర్ధలు, గొడవల వల్లే సారిక ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సారిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడు అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాజయ్యను తొలుత ప్రకటించినా ఈ ఘటన అనంతరం అభ్యర్థిని మార్చింది. సారిక మృతికి రాజయ్య కుటుంబమే కారణమంటూ సారిక తల్లిదండ్రులతో పాటు పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజయ్యపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.