కాంగ్రెస్‌ ప్రచారంలో అజారుద్దీన్‌, నారాయణస్వామి


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా ప్రచారం
నల్గొండ,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ,క్రికెటర్‌ అజహరుద్దీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం నార్కెట్‌ పల్లిలో పర్యటించిన ఆయన
మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే దేశ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 350 ఉన్న గ్యాస్‌ సిలిందర్‌ ధరను వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత బీజేపీదేనని ఆయన ఎద్దేవా చేశారు. చిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో సోనియాను దేవత అన్న కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రంగులు మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన
ఆయన.. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉందన్నారు. ఉద్యోగ కల్పన, దళితులకు మూడెకరాల భూమి, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్‌ విఫలం అయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు వెళ్లరని, మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని, ప్రజలకు అందుబాటులో ఉండరని నారాయణ స్వామి విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.