కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తోడుదొంగలే

– మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారి ఉంది

– ఎన్నికల తరువాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటా

– రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ అంధకారమే

– ప్రజలంతా ఆలోచించి ఓట్లేయాలి

– దేవరకొండ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

నల్గొండ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తోడుదొంగలేనని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం తగ్గాలని.. రాష్ట్రాల అధికారాలు పెరగాలని అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ముందు కరెంట్‌ సమస్యను పరిష్కరించిందన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్‌ సమస్యను పరిష్కరించకుండా 35ఏళ్ల పాటు రైతులను ఏడిపించాయని విమర్శించారు. పొరపాటును కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి అలుముకుంటదని అన్నారు. తెలంగాణకు మొత్తం నీరు అందించడం ఎలా అని నేను రాత్రింబవళ్లు ఆలోచిస్తుంటానని, ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రదర్శన చేస్తే.. విపక్షాలు కనీసం చర్చకు కూడా రాలేదని విమర్శించారు. ప్రధాని మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారీ ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా. రాష్ట్రాల హక్కులను సాధించాలంటే కేంద్రంలో చురుగ్గా ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందు దొందేనని, వాళ్లది కాషాయం.. వీళ్లది మూడు రంగుల జెండా అన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి కర్రపెత్తనం చేస్తున్నదన్నారు. కేంద్రం విూద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. దేవరకొండ ప్రాంతం నుంచి బతుకుదెరువు లేక వేలాది మంది వలస పోయారని కేసీఆర్‌ అన్నారు. దేవరకొండలో ముప్పెనలభై గ్రామాలు మునిగిపోయాయని, నీళ్లు మాత్రం రాలేదన్నారు. పైన కట్టాల్సిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును కింద కట్టారని, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుని చూసి నవ్వాలో ఏడవాలో తెలియదన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రులకు మనకు నీళ్లివ్వాలనే ఉద్దేశం లేదని, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతారని, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఏ తెలివితేటలతో ఒప్పుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ప్రజలకు ఉత్తమ్‌కుమార్‌ , జానారెడ్డి సమధానం చెప్పాలని కేసీఆర్‌ సవాల్‌ చేశారు. దేవరకొండకు తిప్పలు పడి మంచినీళ్లు తీసుకొచ్చామని కేసీఆర్‌ తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి.. వాళ్లే పాలించుకునేలా చేశామన్నారు. అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 85తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని కేసీఆర్‌ తెలిపారు. పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి.. వాళ్లే పాలించుకునేలా చేశాం. తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించకుండా చాన్నాళ్లుగా పెండింగ్‌లో పెట్టిందన్నారు. కేంద్రం మెడలు వంచైనా.. ఎస్టీ రిజర్వేషన్లు బిల్లును సాధిస్తామని, విపక్షాలు ఎన్ని మాయలు చేసినా.. టీఆర్‌ఎస్‌ గెలుపు ఆగదన్నారు. పెద్దమునిగల్‌ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేసి నేరడిగొమ్మును అభివృద్ధి చేస్తామని, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి దేవరకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. చావునోట్లో తలపెట్టి, నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించానని కేసీఆర్‌ అన్నారు.