కాంగ్రెస్‌ బూచి చూపి కాలం గడిపే యత్నం

నాలుగేళ్లుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు

జిఎస్టీతో ప్రజలకు ఇక్కట్లు రెట్టింపు: కాంగ్రెస్‌ నేత శశిధర్‌ రెడ్డి

మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మంత్రి హరీష్‌ రావు పదేపసదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా నిజం లేదని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ఇదే పాఠం వారికి నిత్యకృత్యం అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల మాటలను చూస్తుంటే వారికి కాంగ్రెస్‌ భయం ఎక్కువయ్యిందని అన్నారు. ఇచ్చినహావిూలు అమలు చేయడంలో విఫలం అయి, నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారనే భయంతో కాంగ్రెస్‌ బూచి చూపి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నంలో టిఆర్‌ఎస్‌ ఉందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీ ఏం అయిందని ప్రశ్నించారు. గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్ల హావిూ ఏమయ్యిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న వారు కాంగ్రెస్‌ను చూసి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం కోసమే రీడిజైన్‌, రీఎస్టిమేషన్‌లు వేస్తున్నారని విమర్శించారు. ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ప్రచారార్భాటాలతో ప్రజలను వంచించిందన్నారు. పెద్దనోట్ల రద్దు తరవాత ఇప్పుడ జిఎస్టీతో ప్రజలపై కేంద్రం భారం మోపిందని, దీనిపై కాంగ్రెస్‌ ఆందోళనకు దిగిందని, ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయని అన్నారు. ¬టళ్లు, వస్త్రపరిశ్రమ, వ్యవసాయం,ఫర్నీచర్‌ రంగాలు జిఎస్టీ దెబ్బతో కుదేలయ్యాయని అన్నారు. అలాగే బీడీ పరిశ్రమపై భారంతో మహిళలకు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు. జిఎస్టీపై తక్షణం సవరణలు చేయాలని, నష్టపోయిన రంగాలను మినహాయించాలని అన్నారు.జిఎస్టీ కేవలం కార్పోరేట్లకు లాభం చేకూర్చేలా చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారని ఎంత మంది నల్లకుబేరులను బయటకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పారని కనీసం రూ.100 కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలే అధికంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులు రోజూ బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నా పట్టించుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని అన్నారు. అనాలోచిత నిర్ణయం వల్ల ఒకశాతం ప్రజల దగ్గర నల్లధనంబయటకు తీసేందుకు 99 శాతం మంది దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలపై అన్ని రకాల రుసుములు రద్దు చేయాలని పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులను ఒక ఏడాది వరకు సగం ధరకే పంపిణీ చేయాలని, రైతుల పంట ఉత్పత్తులపై ఎంఎస్‌పీ ధరపై 20శాతం బోనస్‌ అధికంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.