కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి మొహదీన్‌ మృతి

 

బెంగళూరు,జూలై10(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీమంత్రి బీఏ మొహిదీన్‌ కన్నుమూశారు. 81 ఏళ్ల ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ ఉదయం ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మొహిదీన్‌ ప్రస్తుతం బెంగళూరులోని సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. దక్షిణ కర్ణాటకలో మంగళూరుకు సవిూపంలోని బాజ్‌పేకి చెందిన ఆయన.. 1961లో బెంగళూరులోని విజయ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన… మాజీ సీఎం దేవరాజ్‌ హయాంలో 1975 నుంచి 1980 వరకు కర్ణాటక పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మొహిదీన్‌ తొలిసారి 1978లో దక్షిణ కర్ణాటకలోని బంత్వాల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990 నుంచి 2002 వరకు ఎమ్‌ఎల్‌సీగా, 1994 నుంచి 1995 మధ్య శాసన మండలి చీఫ్‌విప్‌గా సేవలందించారు. 1995 నుంచి 1999 వరకు మాజీ సీఎం జేహెచ్‌ పాటిల్‌ హయాంలో ఉన్నత విద్య, పరిశ్రమల శాఖా మంత్రిగా మొహిదీన్‌ పనిచేశారు. సాహిత్యం నుంచి వివిధ కళల వరకు ఆయనకు విశిష్ట ప్రవేశం ఉండడం విశేషం. ‘నన్నోలాగిన నాన్ను’ (నాలో నేను) పేరుతో రాసిన ఆయన ఆత్మకథ త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఆయన మృతికి సిద్దరామయ్య సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.