కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి
16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు
మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
జనంసాక్షి  8 ( మెదక్ బ్యూరో )
సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపుతో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతుందని టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని సీఎస్ ఐ చర్చి ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 16 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి 16 ఎంపీలను గెలిపించే పార్లమెంట్ కు పంపితే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఏర్పడుతుందని, అప్పుడే రాష్ట్రానికి అవసరమైన నిధులు, పథకాలను రాబట్టుకోవచ్చన్నారు. రాష్ట్రం కోసం ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే రాష్ట్రాన్ని సాధించుకున్న మనం, 16 ఎంపీలను పార్లమెంట్ కు పంపితే ఎన్ని అద్భుతాలు సాధిస్తామో చూడాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ కూటములకు మొత్తంగా 273 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని అన్ని సర్వేలు చెబుతున్నాయని,  ఎన్డీఏకు 150 నుంచి 160, యూపీఏకు 100 నుంచి 110 సీట్లు మాత్రమే వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు, సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే గోల్కొండ కోట మీద జెండా ఎగురవేసే అవకాశం ఇచ్చిన  తెలంగాణ ప్రజలు, ఎర్రకోట మీద  సైతం జెండా ఎగుర వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో కాలం చెల్లిందని, వారికి డిపాజిట్లు కూడా రావడం కష్టమేనన్నారు. ఇన్నాళ్లు మన ఓట్లతో వారు బాగుపడ్డారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రంలో మంత్రులుగా వ్యవహరించిన మమతా బెనర్జీ, లాలూప్రసాద్ యాదవ్ లు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు రైళ్లు మార్గాలు వేసుకున్నారే కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఒక్క పనికూడా చేయలేదని ఆరోపించారు. 16మంది ఎంపీలు గెలిస్తే కాళేశ్వరం  ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకోవచ్చాన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు సైతం మెచ్చుకున్నారని, అలాగే మిషన్ కాకతీయ కోసం రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథ కోసం  రూ.19వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో రేపు దేశం అది ఆలోచిస్తుందని ఓ నానుడి ఉండేదని కానీ ఇప్పుడు అది మారిపోయిందని తెలంగాణ ఇవాళ ఆలోచిస్తుందో రేపు దేశం అది ఆలోచిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తన సమర్ధవంతమైన పాలన ద్వారా కేసీఆర్ రాష్ట్రానికి దేశ స్థాయిలో గుర్తింపు తేవడంలో కేసీఆర్ విజయం సాధించారని అన్నారు. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతుబంధు పథకాన్ని కాపీ కొడుతుందని కేటీఆర్ గుర్తు చేశారు.
బావతో కాదు సీఎం కేసీఆర్ కె మా సవాల్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం కంటే కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థికి కనీసం రెండు ఓట్లయినా ఎక్కువ సాధిస్తామని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సవాల్ కైనా తాను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమేనా అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కేటీఆర్ సవాల్ విసిరారు. మెదక్ గడ్డమీద నుంచి తాను సవాల్ చేస్తున్నానని, ఇది మాబావ ( హరీష్ రావు)కు మాత్రమే కాదని, సీఎం కేసీఆర్ కు కూడా అని కేటీఆర్ అన్నారు. తొడగొట్టి చెప్తున్నా అనుకున్నది సాధించి తీరుతామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కనీసం 5 నుంచి 7 లక్షల మెజార్టీ సాధించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని టీఆర్ ఎస్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఒకవేల కాంగ్రెస్ పార్టీకి పోటీచేసే వారు కూడా దొరకని పరిస్థితి ఉందని, ఏకగ్రీవం అయితే మాత్రం సవాల్ చెల్లదని కేటీఆర్ అన్నారు.
మెతుకుసీమ అంటేనే అన్నంపెట్టేదని, కానీ అలాంటి గడ్డను కాంగ్రెస్ దుర్భిక్షంగా మార్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేలను సస్యశ్యామలం చేసిన ఘనత మనకే దక్కిందన్నారు. జిల్లాల పునర్విభజన ద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయం చేశామన్నారు. ఎన్నో పథకాలు ప్రారంభించి ప్రజలకు ఎంతో చేరువయ్యామని హరీష్ రావు అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వల్లనే బాలానగర్ నుంచి బోధన్ హైవే సాధ్యం అయిందని, మెదక్ అక్కన్నపేట్ రైల్వే లైన్ మంజూరు అయిందని గుర్తుచేశారు. ప్రభాకర్ రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపాలని హరీష్ రావు అన్నారు. అనంతరం మాట్లాడిన మాజీ ఉపసభాపతి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి  మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తనను గెలిపిస్తే మరిన్ని నిధులు రాబట్టి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు, సత్యనారాయణ, కార్పొరేషన్ ల ఛైర్మన్ లు శేరి సుభాష్ రెడ్డి, దేవీప్రసాద్, ఎలక్షన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.