కాంగ్రెస్ హయాంలో నిధులు మింగేశారు
మహబూబ్‌నగర్, జనవరి 8: కాంగ్రెస్ నాయకుల పాలనలో ప్రాజెక్టులు పండబెట్టారని, వారు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన తరువాత నాలుగైదేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యేవని, ఆ పనులు పూర్తి కావడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుండేదని అందుకు నిదర్శనం కల్వకుర్తి ప్రాజెక్టు పనులేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నదితీరాన ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ ప్రాజెక్టును ఆరునెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో కూడా వేగం పెంచి పరుగుతీయిస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తామే ప్రాజెక్టులను 90 శాతం పూర్తి చేశామని ప్రగల్భాలు చేస్తుంటారని వారు చేసింది కేవలం పది శాతం పనులు మాత్రమేనని, 90 శాతం నిధులు మెక్కారని ఆరోపించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో ఆర్డీఎస్ ప్రాజెక్టే నిదర్శనమని ఈ ప్రాజెక్టుకు తుంగభద్ర బేసిన్‌లోకి వస్తుందని ప్రాజెక్టు రూపకల్పనతో పాటు ఆప్పట్లో 65 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండేవని చివరి ఆయకట్టుకు సాగునీరు వచ్చిందని అన్నారు. కానీ రానురాను కాంగ్రెస్ నాయకుల నిర్వాకం కారణంగా కేవలం 16 టీఎంసీలకు మాత్రమే పరిమితం అయిందంటే ఎంత అన్యాయానికి ఆయకట్టు రైతులు గురయ్యారో కాంగ్రెస్ నాయకులు ఓసారి గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచించాలని హితవు పలికారు. ఇంత అన్యాయం చేసి రైతుల పొట్టకొట్టిన కాంగ్రెస్ నాయకులు ఎంత ఘనులో ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, దాంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడంతోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నాయకుల పాలనలో పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 13 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవతో కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే వానాకాలంలోనే ఆర్డీఎస్ కాలువల ద్వారా తుంగభద్ర నదీ జలాలను వదులుతామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన మొదట్లోనే 2002లో కేసీఆర్ అలంపూర్, గద్వాల ప్రాంతాలలో పాదయాత్ర చేసినప్పుడే ఇక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయ్యాన్ని గుర్తించి అప్పట్లోనే ఇక్కడ ఓ ప్రాజెక్టు నిర్మించాలని రూపకల్పన చేసుకున్నారని అదే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని మల్లమ్మకుంట, జూలకల్, వల్లూర్ రిజర్వాయర్లును దాదాపు రూ.783 కోట్ల ఖర్చుతో చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంను సైతం పరుగులు పెట్టిస్తామని నెలనెలా ప్రాజెక్టులను సందర్శిస్తానని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణీ లక్ష్యాన్ని నెరవేరుస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపి మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.