కాంగ్రెస్‌ హయాంలో భారీ స్కాంలు

` మేం ఆదా చేసిన సొమ్ముతోనే గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నాం:ప్రధాని మోదీ
భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఇద్దరు తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీలో ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. స్కామ్‌లు చేయకుండా ఆదా చేసిన నగదుతోనే గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు ఆరు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గిరిజనుల అభివృద్ధి కోసం చేసిందేవిూ లేదన్నారు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాకే.. గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటైందని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లోని సివ్‌ని జిల్లాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో లక్షల కోట్ల రూపాయల స్కామ్‌లు జరిగాయి. కానీ, భాజపా అధికారంలోకి వచ్చాక అలాంటివి జరగలేదు. అలా ఆదా చేసిన నగదుతోనే భారత్‌లోని 80 కోట్ల మంది పేదలకు ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్‌ అందిస్తున్నాం. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. కరోనా సమయంలో అన్ని మూతపడితే.. పేదవారు తమ పిల్లలకు ఆహారం ఎలా పెడతారని ఆలోచించా. వారి కోసం ఉచిత రేషన్‌ అందించాలని నిర్ణయించి, ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ప్రారంభించాం. దీని ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆహారం అందివ్వగలుగుతున్నారు. దీన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. భాజపా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్లే భారత్‌లో మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభిస్తున్నాయని అన్నారు. జనరిక్‌ ఔషధ కేంద్రాల ద్వారా 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు విక్రయించడం వల్ల ప్రజలు సుమారు రూ.25,000 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.