కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు
– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర
వరంగల్,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను ఎదరించిన గిరజన వీరులే నేటి వనదేవతులగా అవతరించారు. కాకతీయులను ఎదరించి యుద్దంలో మరణించి అమరులైన వారే ఆ తరవాత వనదేవతలుగా సమ్మక్క,సారలమ్మ దేవతలుగా ఆవిర్భవించారు. వారికి నివాళిగానే ఈ పండగ జరపడం విశేషం. జాతర మొదటిరోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవరోజు చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతల ను ఇద్దరినీ తిరిగి యధా స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనులతో పాటు అన్ని వర్గాలప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహాగొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతర. 12వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క. ఆమెను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్యవిస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. కరువు కాటక పరిస్థితుల వల్ల కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహం చెందుతాడు. అతణ్ని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది. సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయ సైన్యా న్ని ముప్పుతిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్కమ్రించి చిలుకగుట్టవైపు వెళుతూ మార్గమధ్యలోనే అదృశ్యమౌతుంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
18న మేడారం రానున్న సిఎం కెసిఆర్
వనదేవతలు కొలువైన గిరజన జాతరకు మేడారం సిద్దమయ్యింది. ఈ జాతరకు ముందే జనం లక్షలాదిగా తరలివచ్చి గద్దెలను దర్శించుకున్నా జాతరలో అసలు ఘట్టం, జాతర అంకం బుధవారం ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర మూడురోజులపాటు అంగరంగ వైభవంగా సాగనుంది. 17 నుంచి 20వరకు సాగే జాతర కోసం సమ్మక్క,సారలమ్మలు బుధవారం గద్దెలకు చేరుకోవడంతో జాతర ప్రారంభం కానుంది. దీంతో ఈ మూడు రోజులపాటు భక్తులు గద్దెల దర్శనాలకు రానున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరవాత జరుగుతున్న తొలిజాతర కావడంతో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్,ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిసోర్ ఝా తదితరుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీంతో ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భక్తులకు సౌకర్యాలు కల్పించింది. 18న సిఎం కెసిఆర్ అమ్మవార్లను దర్శించుకుంటారు. గోదావరి పుష్కరాల నిర్వహణతో పులకించిన జనం ఇప్పుడు మేడారం జాతర కోసం కూడా ఉవ్వీళ్లూరేలా చేశారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, నూతనవస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అచ్చంగా ఇది ఆదిమవాసుల జాతర కావడంతో అంతా ప్రకృతికి ఆరాధనగా ఉంటుంది. జాతరకు నెలరోజుల ముందునుంచే లక్షల సంఖ్యలో భక్తులు సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా బుధవారం అధికారికంగా ప్రారంభమయ్యే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. వరంగల్ జిల్లా మేడారంలో ఈనెల 17 నుంచి 20 వరకు జరిగే మహా జాతరకు కోటిన్నర మంది వస్తారని అంచనా వేస్తున్నారు. బుధవారం వనదేవత సారలమ్మ గద్దెలకు రావడంతో జాతర మొదలవుతుంది. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తెలంగాణలో జరి గే అతిపెద్ద, విశిష్ట గిరిజన పండుగ. రెండేండ్ల కొకసారి వచ్చే ఈ జాతరకు సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ జాతర ను 1940 వరకు చిలుకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత అందరూ జరుపుకుంటున్నారు. ఏటా జనం పెరగడం మొదలైంది. దీంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణాలను తీసుకొ స్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. మేడారం వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోవిూటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్నది. మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండా కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క-సారక్కలు కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద
గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడి షా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. జాతరను రాష్ట్ర పండుగగా 1998లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఉన్న జాతీయ ¬దా ప్రతిపాదనను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గట్టిగా వినిపించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే భిన్నంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మేడారం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. సుమారు గద్దెల చుట్టూ 19 గ్రామాల్లో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. లక్నవరం చెరువు నుంచి నీటిని వాడుదల చేసి జంపన్న వాగులో స్నానాలకు భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఏర్పాట్లు చేశారు.
విస్తృతంగా రవాణా ఏర్పాట్లు
ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు
మేడారం జాతరకు లక్షల్లో జనం, వేలల్లో వాహనాలు రానుండడంతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. రవాణా మొదలు ట్రాఫిక్ చిక్కులు రాకుండా పోలీసులు రంగంలోకి దిగారు. భక్తుల భద్రత నిమిత్తం వందసీసీ కెమెరాల్ని ఈ జాతరలో వినియోగిస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చేవారు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా సరైన సూచనలతో ముందుకు కదిలేలా అండ్రాయిడ్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. మరోపక్క వెబ్‌సైట్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. సుమారు 10వేల మంది పోలీసులు జాతరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ వెళ్లేలా రహదారలును అందుబాటులోకి తెచ్చారు. ట్రాఫిక్ చిక్కులు ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించేలా రంగం సిద్దం చేశారు. 2014 జాతర వరకు కేవలం రెండే దారులు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు 6 ప్రధాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్-వరంగల్-పస్రా-మేడారం, ఛత్తీస్‌గడ్-ఖమ్మంజిల్లా- ఏటూరునాగారం-మేడారం, నిజామాబాద్- కరీంనగర్-మహదేవ్‌పూర్-మేడారం, భూపాలపల్లి-మేడారం, ఖమ్మం-నర్సంపేట-మేడారం.. ఈ ఐదు దారుల్ని ప్రైవేటు వాహనాలకు వినియోగిస్తున్నారు. అలాగే తాడ్వాయి-మేడారం దారిని కేవలం ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ దారిగా వినియోగిస్తున్నారు. జాతీయరహదారి పస్రా నుంచి తాడ్వాయి వరకు రెండు వరసల దారిగా మార్చారు. భక్తులకు ఆరోగ్యపరంగా విస్తృత సేవలు అందించేందుకు ప్రభుత్వం గద్దెల పక్కనే వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేసింది. భక్తులకు త్వరితగితన సేవలందించేలా 108, 104 వాహనాలు కూడా సిద్ధమయ్యాయి. ఆ ఆసుపత్రిలో 30 మంది సూపర్‌స్పెషలిస్టు వైద్యుల్ని నియమించారు. మొత్తంగా అన్ని రకాల వైద్యులు కలిపి 150 మంది దాకా జాతరలో భక్తులకు వైద్యం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే సమాచారంతో పాటు, సెల్‌ఫోన్లు పనిచేసేలా ప్రైవేటు ఆపరేటర్లు పెద్దఎత్తున మొబైల్ టవర్లను ఏర్పాటుచేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో ప్రతీ రోజూ అరగంట పాటూ ఉచిత వైఫేని అందుబాటులో ఉంచడంతో పాటు 5జీ ప్యాకేజీల్ని కూడా ప్రకటిస్తోంది. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే దాదాపు 30 లక్షలమంది దేవతలను దర్శించుకున్నారని అంచనావేశారు. దీంతో ఈ నాలుగు రోజుల్లో మరో కోటికి పైగా భక్తులు తరలి వస్తారని భావిస్తున్నారు. గత నెల రోజులుగా ఇక్కడికి నిత్యం భక్తులు వస్తున్నారు. ఆది, బుధ, గురువారాల్లో ఎక్కువగా పూజలు నిర్వహించారు. ఇకపోతే
మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. జాతరకు వచ్చే భక్తుల కోసం మొత్తం 4 వేల బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. 11 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించుతున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల ద్వారా 20 లక్షల మంది భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఇకపోతే ఈ నెల 17,18,19,20 తేదీల్లో జరగనున్న సమ్మక్క జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతుంది. 18నుంచి 20వ తేదీ వరకు సిర్‌పూర్ కాగజ్‌నగర్-ఖమ్మం మధ్యన ప్రత్యేక రైలు నడవనుంది. కాగజ్‌నగర్ నుంచి ఈ రైలు ఉదయం బయలుదేరి కొలనూర్ స్టేషన్‌కు 7.45కు వస్తుంది. అలాగే కాజీపేట్ నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌కు వెళ్లేప్పుడు కొలనూర్‌కు రాత్రి 8. 16గంటలకు వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.