యుద్ధం ఆపడమే అత్యుత్తమం
` ముగిసిన ట్రంప్, పుతిన్ కీలక భేటీ..
` సమావేశం ఫలప్రదమైంది
` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి
` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు
` అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది
` త్వరలో జెలెన్‌స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతా: ట్రంప్
` ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు నిజాయతీగా ఉన్నా
` ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానం
` ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చి ఉండేది కాదు: పుతిన్
వాషింగ్టన్(జనంసాక్షి): అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. 2.30 గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడిరచారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.పుతిన్ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడిరచారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు.
ఆకస్మిక ఆహ్వానం..
ట్రంప్, పుతిన్ భేటీ అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాస్కా సమావేశం వివరాలను వెల్లడిరచిన అనంతరం పుతిన్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ తదుపరి భేటీ మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఆహ్వానం ఆసక్తికరంగా ఉందని, అది జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ
` రేపు సమావేశమయ్యే అవకాశం
వాషింగ్టన్(జనంసాక్షి):ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కాలో óేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జరిగిన కొన్ని గంటలకే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే సోమవారం జెలెన్‌స్కీ, ట్రంప్ వాషింగ్టన్‌లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అలాస్కాలో సమావేశం అనంతరం విమానంలో తిరుగు ప్రయాణం చేస్తూ.. ట్రంప్ ఈ కాల్ మాట్లాడినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జెలెన్‌స్కీ ఎక్స్ వేదికలో ధ్రువీకరించారు. ట్రంప్‌తో గంటన్నరకు పైగా ఫోన్‌లో మాట్లాడానని అన్నారు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పునరుద్ఘాటించానని చెప్పారు. పుతిన్‌తో సమావేశంలో చర్చించుకున్న ముఖ్య విషయాలను ట్రంప్ తనకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు వెల్లడిరచారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోమవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించే అన్ని విషయాలపై అక్కడ చర్చిస్తానన్నారు. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ నాయకులకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్‌లు భేటీ అయ్యి రెండున్నర గంటలకు పైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడుతూ.. ఒప్పందంపై నిర్ణయం జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందన్నారు. డీల్ కుదుర్చుకోవాలని తాను సూచిస్తానన్నారు.
ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్‌లు అలాస్కా వేదికగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ.. చర్చలు సానుకూలంగా సాగినట్లు ఇరునేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గంగా పేర్కొన్నారు. కాల్పుల విరమణ నిలబడే అవకాశాలు తక్కువేనన్నారు. అదేవిధంగా జెలెన్‌స్కీ అమెరికా పర్యటనను ధ్రువీకరించారు.
‘’అలాస్కాలో ఇదొక గొప్ప, విజయవంతమైన రోజు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, నాటో సెక్రటరీ జనరల్, ఇతర ఐరోపా నేతలతో ఫోన్‌లో వేర్వేరుగా మాట్లాడాను. నేరుగా శాంతి ఒప్పందానికి వెళ్లడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గంగా ఓ నిర్ణయానికి వచ్చాం. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. జెలెన్‌స్కీ సోమవారం ఓవల్ కార్యాలయానికి రానున్నారు. అన్ని సవ్యంగా సాగితే.. పుతిన్‌తో సమావేశాన్ని షెడ్యూల్ చేస్తాం. తద్వారా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగిన ఈ సమావేశాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడిరచారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. 2022లో తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ పదే పదే చేసిన వ్యాఖ్యలపై తాజా భేటీలో పుతిన్ స్పందించారు. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు.
ట్రంప్-పుతిన్ భేటిని స్వాగతిస్తున్నాం
` ప్రకటించిన భారత విదేశాంగ శాఖ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కా వేదికగా అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతించింది.ఈ భేటీలో భాగంగా సాధించిన పురోగతిని అభినందిస్తున్నట్లు పేర్కొంది. భారత విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్‌ల మధ్య అలాస్కాలో జరిగిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. శాంతి సాధన దిశగా వారి ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఈ భేటీలో సాధించిన పురోగతిని అభినందిస్తున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలి. ఉక్రెయిన్ సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరపడాలని ప్రపంచం కోరుకుంటోంది’’ అని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ట్రంప్, పుతిన్‌లు భేటీ అయ్యేందుకు ముందుకు రావడాన్ని కూడా భారత్ ఇటీవల స్వాగతించిన విషయం తెలిసిందే. ‘’ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాం. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ సందేశానికి ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయి’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పుతిన్‌తో ట్రంప్ భేటీ భారత్ కలిసొచ్చేనా..?
` రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న దేశాలపై సుంకాల విషయంలో పునరాలోచిస్తానన్న అమెరికా అధ్యక్షుడు
రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. ఈ అదనపు టారిఫ్‌ల అంశంపై పునరాలోచన చేస్తానని వెల్లడిరచారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక భేటీ ముగిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌పై జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం ఆపడమే లక్ష్యంగా ట్రంప్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అలాస్కా వేదికగా రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో యుద్ధం ముగింపునకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. భేటీ సానుకూలంగానే జరిగినట్లు ట్రంప్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత.. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. దీనిపై రెండు, మూడు వారాల్లో పునరాలోచన చేస్తా. ప్రస్తుతానికి సమావేశం సాఫీగా జరిగింది’’ అని ట్రంప్ వెల్లడిరచారు. కాగా.. పుతిన్‌తో భేటీకి ముందు కూడా ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. భారత్‌ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించే ఉద్దేశం లేదన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ఇటీవల భారత్‌పై 25శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగకపోతే.. భారత్‌పై అదనపు సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించకపోతే రష్యాపైనా 100శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో తెలిపారు. ఈ పరిణామాల వేళ పుతిన్‌తో భేటీ తర్వాత టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి రష్యాతో పాటు మాస్కో చమురు కొంటున్న దేశాలపైనా సుంకాలు ఉండకపోవచ్చని ట్రంప్ తన వ్యాఖ్యలతో సంకేతాలు ఇచ్చినట్లయింది.