కారం మెతుకులపై రేవంత్‌ సర్కార్‌ కన్నెర్ర


మెనూ మెక్కిన ‘పందికొక్కులపై’ ఏసీబీ అస్త్రం
స్వీట్లు, అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా స్వాహా
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోదక శాఖ దాడులు
నాసిరకం పదార్థాలతో వంటకాలు చేస్తున్నట్టు నిర్ధారణ
టాయిలెట్లు సరిగ్గా లేక చాలాచోట్ల విద్యార్థుల అవస్థలు

పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం కేటాయిస్తున్న నిధులను ‘పందికొక్కుల్లా’ బుక్కేస్తున్నవారిపై రేవంత్‌ సర్కార్‌ ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది. నాసిరకం భోజనం పెడుతూ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నవారి భరతం పట్టేందుకు నడుం బిగించింది. చాలాచోట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలతో వంటకాలు చేపడుతూ రేపటి భావిపౌరులకు కాలం మెతుకులను వడ్డించడంపై కన్నెర్రజేసింది. ఇటీవల కాలంలో పలు గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందడం, అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టడం అధికారులు, వార్డెన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అత్యధిక హాస్టళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలతో వండుతున్నట్టు తనిఖీల్లో బయటపడటం గమనార్హం.
హైదరాబాద్‌/కరీంనగర్‌/మెదక్‌/ఖమ్మం (జనంసాక్షి)
విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపడం, రికార్డుల్లో అవకతవకలు చేయడం సహా తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. తెల్లవారుజామునే హాస్టళ్లకు చేరుకుని విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లోనూ తనిఖీలు కొనసాగాయి. విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, వివిధ సదుపాయాలకు హాస్టల్‌ నిర్వాహకులు గండికొడుతున్నారని, తప్పుడు బిల్లులతో కాజేస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు చేయగా అక్కడి దుస్థితి బయటపడిరది. ఏసీబీతో సహా ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్‌ అధికారులు వసతి గృహంలో తనిఖీలు చేపట్టగా.. విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని, వంట సరుకులు సైతం వండే పరిస్థితిల్లో లేవవి నాసిరకంగా ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ వెల్లడిరచారు. మెనూ ప్రకారం భోజనం వండటం లేదని, విద్యార్ధులకు అందాల్సిన స్వీట్లు, అరటి పండు, కోడి గుడ్లు కూడా అందించడంలేదని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. హాస్టల్‌ పరిసర ప్రాంతమంతా శుభ్రంగా లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా చాలారోజులుగా శుభ్రపరచుకుండా ఉంచినట్లు వివరించారు. రిజిస్టర్‌లో 120 మంది విద్యార్ధులు ఉన్నట్లుగా నమోదు చేసినా వాస్తవంగా అక్కడ 80 మంది విద్యార్ధులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఉదయం 6 గంటల తర్వాత తనిఖీలు జరిగిన సమయంలో వార్డెన్‌ కూడా అందుబాటులో లేరని, ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
వసతులు, హాజరుపై ఆరా..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్‌ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న ఈ గురుకులాల్లో 680 విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల విద్యుత్‌ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రభుత్వ వసతి గృహాల్లోనూ ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్‌లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తునట్లు అధికారులు గుర్తించారు. వసతిగృహాల్లోని బాత్రూంలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్‌మెనూ పాటించడం లేదని వెల్లడిరచారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్‌ కులాల బాలికల వసతి గృహంలో తనిఖీలు చేపట్టగా.. వసతులు అంతంత మాత్రంగానే అందుతున్నట్టు గుర్తించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేసి మెస్‌, స్టూడెంట్స్‌ రిజిస్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. పలు హాస్టల్‌ స్టూడెంట్స్‌ రిజిస్టర్‌లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్‌లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్‌ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్‌ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దూర్‌ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులలో దాడులు చేపట్టారు.

నేలపై వద్దు.. మంచం, బెడ్‌ ఉండాలి
పెద్దాపూర్‌లో విద్యార్థుల మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది
పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలకు తక్షణమే రూ. 50 లక్షలు మంజూరు
విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపునకు కమిటీ వేస్తాం
మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకొకరోజు గురుకులాల పర్యటన : భట్టి విక్రమార్క
జగిత్యాల బ్యూరో/రాయికల్‌ (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేసి ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడిరచారు. నెలలో ఒక రోజున రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గురుకుల పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో భోజనం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగునంగా జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్వోలు సైతం నెలలో ఒక రోజున గురుకుల పాఠశాలలో బస చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంగళవారం డిప్యూటీ సీఎం సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థులు తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నడూలేనివిధంగా ఈ బడ్జెట్‌ లో ప్రజా ప్రభుత్వం రూ. 5వేల కోట్లు కేటాయించిందన్నారు. పక్క భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2015 -16 ఆర్థిక సంవత్సరంలో 197 కోట్ల కేటాయించగా 2016 17 ఆర్థిక సంవత్సరం నాటికి 116 కోట్ల రూపాయలకు కుదించిందన్నారు. 2018- 19 సంవత్సరంలో రూ. 79 కోట్లు, 2019-20 వార్షిక సంవత్సరంలో 70 కోట్లు, 2020-21 వార్షిక సంవత్సరంలో కేవలం 11 కోట్లు, 2021-22 వార్షిక సంవత్సరంలో 9 కోట్లు, 2022-23 వార్షిక సంవత్సరంలో ఏడు కోట్లు, 2023 24 వార్షిక సంవత్సరానికి మూడు కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. ఇలాంటి తరుణంలో పెద్దాపూర్‌లో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం ప్రజా ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచిసి వేసిందని బాధపడ్డారు. ఇక్కడ నీటి కుంటలు, చెత్తాచెదారం లేకుండా అభివృద్ధి చేయడానికి, టాయిలెట్స్‌ నిర్మాణం కోసం ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు మంజూరు చేశామన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డార్మీటరీ, డైనింగ్‌ హాల్స్‌, భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించిన వెంటనే ఒక్కరోజు ఆలస్యం చేయకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియాతో పాటు గురుకుల సొసైటీలో వారి విద్యా అర్హతకు అనుగుణంగా ఔట్సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇల్లు లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించినట్టు చెప్పారు.
విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపునకు కమిటీ వేస్తాం
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలు పెంచడానికి త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత డైట్‌ చార్జీలను పెంచుతామని వెల్లడిరచారు. గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నేలపైన పడుకోవడానికి వీలులేదని కచ్చితంగా మంచం, బెడ్‌, బెడ్‌ షీట్‌ను ప్రభుత్వ సమకూర్చుతుందని ఇందుకోసం ప్రతిపాదనలు పంపితే నిధులు విడుదల చేస్తామని గురుకులాల సెక్రటరీ రమణ కుమార్‌ ఆదేశించారు. ప్రతి గురుకులంలో అత్యవసర ఔషధాలు, పారా మెడికల్‌ స్టాఫ్‌, కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గురుకులాల సెక్రెటరీని ఆదేశించారు. టాయిలెట్స్‌, బాత్రూమ్స్‌ విద్యార్థులకు అనువుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈజీఎస్‌ పనుల కింద గురుకుల పాఠశాలలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు తొలగించి, పండ్లు, ఔషధ మొక్కలు నాటించాలని చెప్పారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్స్‌, టీచర్స్‌, పారామెడికల్‌ సిబ్బంది రాత్రి సమయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.