*   కారులో రగులుతున్న ఆధిపత్య  పోరు

రచ్చకెక్కిన వర్గ విభేదాలు

 

* పోటా పోటీగా మీడియా సమావేశాలు

 

* హైదరాబాద్ చేరిన కరీంనగర్ కారు పంచాయతీ

 

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :

కరీంనగర్ కారులో ఆధిపత్య పోరు రగులుతోంది. టిఆర్ఎస్ నేతల పంచాయితీ అధిష్టానానికి చేరింది.

కరీంనగర్ కారు పార్టీలో అంతర్గత పోరు జోరందుకుంది. గత కొద్ది కాలంగా కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలు బహిర్గతమై కరీంనగర్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సొంత పార్టీ వారే, వేరే కుంపటి పెట్టి పోటా,పోటీగా శనివారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆదివారం కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి ఎవరు ద్రోహం చేసిన వదిలిపెట్టేది లేదని వినోద్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది. పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొని అందరి చూపు కరీంనగర్ వైపు మళ్లించాయి. శనివారం కార్పొరేటర్  కమల్జిత్ కౌర్, భర్త సోహన్ సింగ్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపు వైరల్ గా మారాయి. మంత్రి గంగుల కమలాకర్ ను బదనాం చేస్తూ, బురద చల్లటానికి తెరవెనుక కుట్రలు సాగిస్తున్నారని ఈ ఆడియో టేపులు అందుకు సజీవ సాక్ష్యం అని కార్పొరేటర్లు సుడా పాలకవర్గ సభ్యులు , కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్లు తెరాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి వి  రామకృష్ణారావును కలిసి తక్షణం కమల్ జీత్ కౌర్, సోహాన్ సింగ్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ల పై  క్రమశిక్షణా చర్యలు తీసుకొని, పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి ఆధ్వర్యంలో నగరపాలిక కార్పొరేటర్లు వినతి పత్రం అందించి మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీని, మంత్రిని, మేయర్ లపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, బహిర్గతమైన ఆడియో టేపులు అందుకు సజీవ సాక్ష్యం అని, సోహన్ సింగ్ అడ్డంగా దొరికాడు అని వారు ధ్వజ మెత్తారు. దీనికి ప్రతిగా సోహన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా మంత్రి చేయిస్తున్న కుట్రేనని తానేం తప్పుగా మాట్లాడలేదని తన భార్య అయిన కమల్ జిత్ కౌర్ ను, తనని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా కు సిద్ధమన్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు సంబంధం లేకున్నా ఆయన కు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఓర్వలేక నాటకీయ రాజకీయాలకు తెరలేపార  ని  ధ్వజమెత్తారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే మాజీ మేయర్ రవీందర్ సింగ్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి దేశాభివృద్ధి  కేసీఆర్ తోనే సాధ్యం అన్నారు. మరోవైపు కమలం పార్టీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గ్రానైట్ వ్యాపారస్తుల పై ఈడీ దాడులు ఏమయ్యాయని ప్రశ్నించారు. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు, ఎంపీ అయిన తర్వాత ఆస్తులు ఏ మేరా పెరిగాయో బహిరంగ రహస్యమే నని, ఆస్తుల విలువ ఎంతో బహిర్గత పరచాలి అని డిమాండ్ చేశారు. కమల్ జిత్ కౌర్, భర్త సోహన్ సింగ్ ,మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు, ఎవరికి వారే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం తో వర్గ పోరు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పలు నాటకీయ పరిణామాలు  చోటు చేసుకుని అందరి చూపు కరీంనగర్ వైపు మళ్లించాయి. కలకలం సృష్టించిన ఈ ఉదంతం కారు వేగానికి  కళ్లెం వేస్తుందా కమలానికి ఊతమిస్తుం దా అనే చర్చలు జోరందుకున్నాయి. కారులో రివర్స్ గేర్ ఖాయమని, సొంత పార్టీలోనే అసమ్మతి గళం వినిపించటం పార్టీలోని అనైక్యతకు అద్దం పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు