కారెక్కనున్న రాజాసింగ్?
హైదరాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరే టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్దం అవుతున్నారు. గురువారం అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్,టిడిపిలకు చెందిన ప్రభాకర్, సాయన్నలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిపై తిరుగుబాటును ప్రకటించిన గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తదుపరి వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని బీజేపీ వర్గాలు అంచనాకొచ్చాయి. పార్టీ మారే ఆలోచనలో భాగంగానే విమర్శలకు దిగారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ ఆకర్ష్ పథకానికి అందరూ జారుకుంటున్నారని అంటున్నారు. ఈ దోవలో కాంగ్రెస్నేత దానం నాగేందర్ కూడా ఉన్నారన్న ప్రచారం ఉంది. త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో భారీ మెజారిటీని సాధించిన అధికార టీఆర్‌ఎస్ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టిని సారించింది. ఇలాంటి తరుణంలోనే టీడీపీకి చెందిన సికింద్రాబాద్ (కంటోన్మెంట్) ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎస్ ప్రభాకర్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిణామానికి ఒకరోజు ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ అధ్యక్షుడిపై బహిరంగంగా విరుచుకుపడటం, కిషన్‌రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం ఆ పార్టీలో సంచలనంగా కలిగించింది. రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ సీనియర్లు పలువురు నేతలు సమావేశమై చర్చించారు. టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరిగిన తర్వాత ఆ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చిన కారణంగానే బహిరంగ విమర్శలకు దిగారన్న అంచనాకొచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ వివరాలను పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి
కూడా తెచ్చినట్టు తెలిసింది. రాజాసింగ్ విషయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయన టిఆర్‌ఎస్‌లో చేరుతారని టిఆర్‌ఎస్ వర్గాలు కూడా అంటున్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల కోసం కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.