కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళి

2

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి): ‘కార్గిల్‌ విజయ దివస్‌’ సందర్భంగా అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు.  కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే వీరజవాన్ల సేవలను కొనియాడారు. చిట్టచివరి శ్వాస వరకూ దేశం కోసమే పోరాడి అమరులైన సాహస జవాన్ల సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తించుకుటుందని, వారి వీరోచిత త్యాగాలు అందిరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 1990 కార్గిల్‌ యుద్ధ సమయంలో సైనికులు చూపిన తెగువ చిరస్మరణీయమని ఆయన అన్నారు. చొరబాటుదారులకు తిరుగులేని జవాబిచ్చి తరమికొట్టారని శ్లాఘించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శించిన రాజకీయ దృఢ వైఖరిని కూడా ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. 1999లో అధికారంలో ఉన్న నాయకత్వం తీసుకున్న దృఢమైన నిర్ణయం వల్లే కార్గిల్‌ విజయం మనను వరించిందని మోదీ ఈ సందర్భంగా అన్నారు.మరోవైపు కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనె ‘విజయ దివస్‌’ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ‘మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు తలవంచి సెల్యూట్‌ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్‌ దివస్‌’ అని ఆయన  ఉదయం ట్వీట్‌ చేశారు. కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులు అర్పించారు.  సందర్భంగా రక్షణమంత్రి పారికర్‌…అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.