కార్డెన్‌ సర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): నిర్బంధ తనిఖీలతో శాంతియుత వాతవరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలతో ప్రజలు సుఖ శాంతులతో జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చింతల్‌మెట్‌లోని పలు కాలనీల్లో డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి పర్యవేక్షణలో మొత్తం రెండు వందల మంది పోలీసు సిబ్బంది నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఇంటింటికి వెళ్ళి కొత్తవారు అద్దెకుంటున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పది మంది రౌడీషీటర్లను, మరో పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే 30వరకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, ఒక కారు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.