కార్పోరెట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలు

3

– శవాలకూ పరీక్షలు

– షుగర్‌ పరీక్షకు వెళితే 28 టెస్టులు

– గవర్నర్‌ ‘ఉగ్ర’నరసింహన్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి):  వైద్యరంగంలో కార్పోరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలుగా మారాయని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యరంగంలో విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. విలువలు లేకుండా ప్రైవేట్‌ వైద్యరంగం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 13వ ఆలిండియా క్యాన్సర్‌ కేర్‌ సదస్సులో గవర్నర్‌   పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోగులకు ప్రేమను కూడా పంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైద్య రంగంలో ఎథిక్స్‌ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌ నరసింహన్‌ ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. కార్పోరేట్‌ ఆస్పత్రులు కేవలం వ్యాపారంగానే వైద్యాన్ని నడుపుతున్నాయని అన్నారు. వైద్య పరీక్షల పేరుతో ప్రజలను పీడిస్తున్నారని ఆయన అన్నారు. అవసరం ఉన్నా,లేకున్నా వైద్య పరీక్షల పేరుతో ఫీజులు గుంజుతున్నారని, చివరికి శవాలకు కూడా పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,కాని దానిని కొందరు వ్యాపారమయం చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎక్కువ మంది హైదరాబాద్‌ కే పరిమితమై గ్రామాలకు వెళ్లడం లేదని, ఎందుకు గ్రామాలకు సేవ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆస్పత్రులకు వెళ్లినవారికి బిల్లులు గుండె గుభేల్‌ అనిపిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలని నరసింహన్‌ అన్నారు. వైద్యులు నీతి నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని అప్పుడే ప్రజలకు మేలు కలుగుతుందని గవర్నర్‌ నరసింహాన్‌ అన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా డాక్టర్లు గ్రావిూణ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే  వైద్యరంగంలో నీతినియమాలు పాటించాల్సిన  అవసరం ఉంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.  షుగర్‌ టెస్టుకు వెళితే 28 టెస్టులు చేస్తున్నారు. రోగులకు ప్రేమను కూడా పంచాల్సిన బాద్యత వైద్యులపై ఉంది. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు.