కార్పోరేట్‌కు దీటుగా పాఠశాలల అభివృద్ది

విశాఖపట్టణం,జూన్‌9(జనం సాక్షి ): కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ప్రజలకు ప్రభుత్వవిద్యను చేరువ చేసే లక్ష్యంతో సిఎం చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉండేందుకు గాను రాష్ట్రానికి రూ. 4,200 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. అలాగే పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఈ మేరకు చిన్నారులకు రుబెల్లా, తట్టు వ్యాధుల్ని నిరోధించే వ్యాక్సిన్ల శిబిరాన్ని ప్రారంభించామని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. భారతదేశంలోనే ఏపీని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం శ్రమిస్తున్నారని తెలిపారు. రుబెల్లా, తట్టు వ్యాధులు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్లను పిల్లలకు వేయించడానికి సంకల్పించిందని, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.