కార్మికుల ఆత్మస్థయిర్యం దెబ్బతీయవద్దు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై కొందరు కార్మిక సంఘాల నేతలు తప్పుడు ప్రచారం చేస్తుందని తెబొగకాసం నేతలు అన్నారు. దేశంలో ఏ పరిశ్రమలో ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆ సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు అన్నారు. ఇది కార్మికుల స్థయిర్యాన్ని దెబ్బతీయడం తప్ప మరోటి కాదన్నారు. అన్‌ఫిట్‌ వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అయితే సింగరేణిలో 1981 నుంచి 1996 వరకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయం మరువొద్దన్నారు. కొత్త గనులు వస్తే వీఆర్‌ఎస్‌ వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్న హావిూతో జాతీయ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, వీఆర్‌ఎస్‌, డిస్మిస్‌ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం, నూతన భూగర్భబొగ్గు గనుల ఏర్పాటు తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తెబొగకాసం కృషి చేస్తుందని అన్నారు. ఏఐటీయూసీ తీరు వల్లే ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆరోపించారు.సకల జనుల సమ్మె వేతనాలు 97 శాతం మంది ఉద్యోగులకు అందినట్లు చెప్పారు.