కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం
సిద్దిపేట రూరల్, (జనం సాక్షి ): కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్ విమర్శించారు. శనివారం సిద్దిపేటలో సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.వేల కోట్లను రాయితీగా అందిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నేరవేర్చలేదన్నారు. దేశంలో మహిళలు, దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణను సాధిస్తామని చెప్పి, ఫాంహౌస్‌లో కాలం గడుపుతున్నారని ఎద్దేవాచేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో బహుజన తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలస్వామి, కార్యదర్శి మామిండ్ల రేవంత్‌కుమార్, నాగరాజు, కళావతి, పద్మ, ఎల్లయ్య, కనకయ్య, మహేశ్, మధు, చంద్రారెడ్డి, రాములు, కిషన్ తదితరులు ఉన్నారు.