కాలుష్యాన్ని కలిగిస్తే సహించం
– కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తాం
– పరిశ్రమలు పర్యావరణ రహితంగా ఉండాలి
– 16వరకు కాలుష్యకారణ పరిశ్రమలను మూసివేయించాం
– భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాం
– పాశమైలారంలో ఐటీఐను ఏర్పాటు చేస్తాం
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
– పాశమైలారంలో వ్యర్థ జలాల శుద్దీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి
– పరిశ్రమను ఆరు నెలల్లో పూర్తిచేస్తామని వెల్లడించిన కేటీఆర్
సంగారెడ్డి, జులై9(జనం సాక్షి) : కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తామని, కాలుష్యాన్ని కలిగిస్తే సిహించమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పటాన్‌చెరు మండలం పాశమైలారంలో వ్యర్థ జలాల శుద్దీకరణ కేంద్రానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పటాన్‌చెరు మండలంలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి ప్రజల అభ్యర్థన మేరకు వ్యర్థ జలాల శుద్దీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పరిశ్రమలు పర్యావరణహితంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, గతంలో పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో కాలుష్యాన్ని కలిగిస్తే సహించబోమని, అవసరమైతే పరిశ్రమలు మూసివేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత ఉపశమనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.104.24 కోట్లతో ఆరు నెలల్లో శుద్దీకరణ కేంద్రాన్ని పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు పాశమైలారంలో ఐటీఐను ఏర్పాటు చేస్తామని మంత్రి హావిూనిచ్చారు. ఈ ఐటీఐ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమలు పర్యావరణహితంగా ఉండాలని, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా ఉండొద్దని కేటీఆర్ సూచించారు. కాలుష్య నియంత్రణపై పరిశ్రమల అధినేతలతో గతంలో తానే స్వయంగా మాట్లాడానని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో 13 నుంచి 16 కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయడం జరిగిందని తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమల నుంచి బయటపడేందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టంచేశారు. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే ఆ కంపెనీలను మూసివేయడం జరిగిందన్నారు. 1,122 పరిశ్రమలను రెడ్, ఆరెంజ్ కేటగిరిగా విభజించామని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిలో 283 పరిశ్రమలను హైదరాబాద్ ఫార్మా సిటీకి తరలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఫార్మా సిటీ వద్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్రవ వ్యర్థాలను పూర్తిగా శుద్ధికరణ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.