కాలుష్య నివారణకు కేజ్రీవాల్‌ నిర్ణయం భేష్‌

4
– నేను కాలినడకన కోర్టుకు వెళ్లగలను

– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి):  కారు వాడని రోజు బస్సు లేదా కాలినడకన కోర్టుకు వెళ్తానని.. అందులో తనకెలాంటి సమస్య లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ అన్నారు. దేశ రాజధాని దిల్లీలో కాలుష్య నివారణకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన మద్దతు పలికారు. కారు వాడకం లేని రోజు తాను బస్సులో కోర్టుకు వస్తానని.. అదీ కుదరకపోతే నడిచి వెళ్తానన్నారు. ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నడిచివెళ్తే.. మిగతా ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడైనా దిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు. జస్టిస్‌ ఠాకూర్‌ మద్దతుకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. దిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం నియంత్రించడానికి.. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన వాహనాలను రోడ్లపైకి రాకుండా చేసేందుకు దిల్లీ ప్రభుత్వం నూతన ప్రణాళికను చేపట్టిన విషయం తెలిసిందే. వాహన రిజిస్గేషన్‌ నెంబర్‌లో చివరి అంకె బేసి సంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజు, సరిసంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజు రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక వాహనం రోజు విడిచి రోజు మాత్రమే రోడ్డు పైకి రాగలదు. ప్రభుత్వ వాహనాలకు ఈ పరిమితులు లేవు. తాజా నిబంధనలు జనవరి 1, 2016 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.