కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు
బృందాలుగా టిఆర్‌ఎస్ నేతల సందర్శన
సిద్దిపేట,జూన్26(జనం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి కాగానే తెలంగాణలోని బీడు భూముల్లో గోదారమ్మ పరువళ్లు తొక్కనున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. రైతుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను పరిశీలించిన టీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. బృందాలుగా ప్రజాప్రతినిధులను కాళేశ్వరం సందర్శనకు తీసుకుని వెళుతున్నామని, దీంతో వారిలో ప్రాజెక్టులపై అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శమన ఎమ్మెల్యే అన్నారు వివిధ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సందర్శించేందుకు ప్రత్యేక బస్సులు, వాహనాల్లో తరలి వెళ్లారని అన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సందర్శన అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తక్కువ వ్యయం, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నదని, ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు చోటు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ సర్కారుకు దక్కుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు.