కాళేశ్వరంపై మరో పిటిషన్‌

కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన మరో పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవసరానికి మించి నీటి నిల్వ సామర్థంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేసింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రలకు సంబంధించిన విషయమని, మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేస్తే సుప్రీంకోర్టుకు రావాలని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. ఇది అంతర్‌రాష్ట్ర వివాదమని పిటిషనర్‌ పేర్కొనగా, ఆయన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. తెలంగాణ తరపున ముకుల్‌ రోహత్గీ తన వాదనలు వినిపించారు.