కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో పూర్తి కానున్న తొలిదశ
ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడంతో ప్రక్రియ విజయవంతం
కరీంనగర్,జూలై30 (జనం సాక్షి) : కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంప్‌హౌస్ లోకి కాళేశ్వ రం జలాలు వచ్చి చేరుతున్నాయి. ఈ పక్రియ ఆరంభమైన తర్వాత కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో మొదట దశ పూర్తి కానున్నది. సుందిళ్ల బ్యారేజీలో ప్రస్తుతం నీటి నిల్వ 5.75 టీఎంసీలు ఉన్నాయి.ఒకటి, రెండు రోజుల్లో పంప్‌హౌస్‌లో వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ పంప్‌హౌస్‌లో మొత్తం 9 మోటార్లు ఉండగా, ప్రస్తుతం 6 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి 16 విూటర్ల ఎత్తులో ఉండే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయ నున్నారు. అన్నారం పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు నడుస్తున్నాయి. అన్నారం బ్యారేజీలో 7.79 టీఎంసీల నీళ్లు ఉండగా, కన్నేపల్లి నుంచి 4 మోటార్ల ద్వారా 9 వేల క్యూసెక్కుల వరకు నీటిని వదిలి పెడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నీటి మట్టం 4.70 టీఎంసీలు ఉండగా, ప్రాణహిత ఎగువ ప్రాంతం నుంచి 10 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలతో 12,916 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 5.61 టీఎంసీలకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటి మట్టం 13.55 టీఎంసీలు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండాలంటే 14.56 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉన్నది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధి కారులు చెబుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశాలు న్నాయి. ప్రస్తుతం ఉన్న వరద ఏమాత్రం తగ్గకుండా ఉంటే మాత్రం మంగళవారం సాయంత్రం నాటికి బ్యారేజీ నీటిమట్టం 7టీఎంసీలకు చేరనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో సుందిళ్ల పంప్‌హౌస్ వెట్ రన్ పూర్తయి 3, 4 మోటార్లు రన్ అయితే ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరగను న్నది. మేడిగడ్డ వద్ద ప్రస్తుతానికి వరద తక్కువగా ఉన్నది. ప్రాణహిత ఎగువన భారీ వర్షాలు కురిస్తే వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో కాళేశ్వరం పంప్ హౌస్‌ల మోటార్లు నిరాటంకంగా నడవనున్నాయి.