కాశ్మీర్ పరిస్థితులకు సర్కారుదే బాధ్యత
– గులాంనబీ అజాద్
– అన్నిపక్షాలు సహకరించాలి
– అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులకు సర్కారే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా
కశ్మీర్ లో అల్లర్లకు వేర్పాటువాదులే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశానికి, వేర్పాటువాదల మధ్య సమరం సాగుతోందని ఆయన అన్నారు. కశ్మీర్ అంశంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్‌లో భూభాగమని పాకిస్థాన్ ఎప్పుడూ గుర్తించలేదని జైట్లీ అన్నారు. బీజేపీ-పీడీపీ కూటమి ప్రభుత్వం వల్ల కశ్మీర్ లో హింస చెలరేగుతోందన్న విషయం వాస్తవం కాదని ఆయన అన్నారు. అది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే అన్నారు. దేశం కోసం కొన్ని సందర్భాల్లో రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. కశ్మీర్ లో వేర్పాటువాదులను ఎదుర్కోవాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలతో కలిసి పనిచేయాలన్నారు. టీవీల్లో పాకిస్థాన్ అంశాన్ని చర్చించడం వల్ల హింస పెరగడం లేదని జైట్లీ అన్నారు. సంప్రదాయ యుద్ధాలతో భారత్‌ను జయించలేకపోయిన పాకిస్థాన్ మిలిటెంట్ల సాయాన్ని తీసుకుంటోందన్నారు. వేర్పాటువాదులు సరికొత్త పంథాలో ముందుకు వెళ్లుతున్నారని, వేలాది మంది ఒక్కసారిగా పోలీసులు, ఆర్మీపై తిరగబడితే…వాళ్లను తరిమికొట్టడం ఒక్కటే మార్గమని జైట్లీ అన్నారు. కశ్మీర్‌లో చెలరేగిన హింసలో పాకిస్థాన్ పాత్ర ఉన్నట్లు కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ కూడా అంగీకరించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చర్యల వల్లే మెజారిటీ ప్రజలు మైనార్టీలను అనుమానించాల్సి వస్తుందన్నారు. తాము (ముస్లింలు) ఇక్కడే ఉండేందుకు నిశ్చయించామని, మాపై రాళ్లు రువ్వరాదని ఆయన పాకిస్థాన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కశ్మీర్‌లో సైన్యం బల ప్రయోగంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉగ్రవాది బుర్హాన్ హత్య తర్వాత కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్ల వల్ల ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొందని గులామ్ నబీ ఆజాద్ అన్నారు. కశ్మీర్‌లో ఆందోళనకారులపై పెల్లెట్లను వాడడాన్ని ఆయన ఖండించారు. కశ్మీర్‌లో మిలిటెంట్లను రూపామాపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామని, కానీ సాధారణ పౌరుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు సరికాదన్నారు. మిలిటెంట్లను చూసినట్లుగానే స్థానికులను చూడాలా అని ఆయన ప్రశ్నించారు. మిలిటెంట్లను తుదముట్టించిన బుల్లెట్లును స్థానికులపైన కూడ వాడాలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ముస్లింల జనాభా ఎక్కువే అని, అయినా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఉనికి తక్కువ అని, భారతీయ ముస్లింలు దేశాభిమానం కలిగిన వ్యక్తులు అని అన్నారు. ప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు మైనార్టీలను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ-పీడీపీ కూటమి వల్ల కశ్మీర్ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లుతోందని ఆజాద్ అన్నారు. కశ్మీర్ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలని, ఆ సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కశ్మీర్ అంశంపై విూడియా ప్రచారం కూడా అతిగా ఉందని, దాని వల్ల విభేదాలు పెరుగుతన్నాయన్నారు.