కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం
ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం
ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు
ఆదిలాబాద్,మే3(జనంసాక్షి): ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక తవ్వకాలతో వాగులు, వంకలు మాయమవుతున్నాయి. గోదారి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల నుంచి కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వేసుకుంటున్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులను నిలిపివేయడంతో ఇసుకకు డిమాండు పెరిగింది.
జిల్లాలు విభజన తర్వాత ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఆయా జిల్లాల అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. దీనికితోడు వరుస ఎన్నికలతో పోలీసులు అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ఇసుక వ్యాపారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు స్థానిక వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలి స్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా ఇసుక తరలించి ఇక్కడ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కుంట్లం సవిూపంలోని గోదావరిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్న గుత్తేదారులు అడ్డ గోలుగా తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు గోదావరికి అవతల ఒడ్డున ఉండగా.. ఇవతల వైపు మంచిర్యాల జిల్లాలో తవ్వకాలు చేస్తున్నారు. హద్దులు దాటి పూర్తిగా మంచిర్యాల జిల్లా వైపున అడ్డగోలుగా ఇసుక అమ్మకాలు జరుపుతున్నారు. ఇవతల వైపు కోటపల్లి మండలం కొల్లూరులో అక్రమంగా ఇసుక నిల్వకేంద్రాన్నిఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ వంద లారీలకు పైగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. కనీస నిబంధనలు పాటించడం లేదు. టీఎస్‌ఎండీసీ సిబ్బంది లారీకు రూ.2 వేలు అదనంగా తీసుకుని 5 టన్నుల వరకు ఓవర్‌లోడుతో నింపుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం లేకపోవడంతో అడ్డంగా రహదారిని ఏర్పాటు చేశారు. క్వారీ వల్ల భూపాలపల్లి జిల్లాకు ఇసుక ఆదాయం సమకూరుతుండగా.. మంచిర్యాల జిల్లా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి అవతల ఇసుక అనుమతులు ఉంటే.. గోదావరికి ఇవతల నిల్వ చేసుకోవడానికి వీల్లేదు. మంచిర్యాల పట్టణానికి గృహ అవసరాల కోసం పాతమంచిర్యాల, రామారావుపేట, ముల్కల్ల, వేంపల్లి, నస్పూర్, తాళ్లపల్లి సవిూపంలోని గోదావరిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇదే అదునుగా భావించి ఇసుక వ్యాపారులు రంగంలోకి దిగారు. ఇక్కడ ఇసుకకు డిమాండు ఉండటంతో మంచిర్యాలకు ఆనుకుని ఉన్న గోదావరి నుంచి ప్రతి రోజూ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ ట్రాక్టర్ ఇసుక రూ.2వేలపైనే చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నూరు మండలం సుద్దాల వాగు, బతుకమ్మవాగు, అక్కెనపల్లి వాగుల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల కొద్ది ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున గ్రామపంచాయతీలకు చెల్లించి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పెన్‌గంగ నది నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. రోజుకు వందలకొద్దీ ట్రాక్టర్ల ఇసుక ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా అక్రమంగా ఇసుక తీసుకొస్తున్నారు. వాస్తవానికి అంతరాష్ట్ర సరిహద్దుల్లో టీఎస్‌ఎండీసీ తనిఖీకేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.స్థానిక ఖనిజ సంపదను కాపాడాల్సిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్థి కమిటీలే వాటిని కొల్లగొడుతున్నారు. నిజామాబాద్ జిల్లా పెద్దవాగు, మహారాష్ట్రలోని దర్మాబాద్, చంద్రాపూర్ జిల్లా మూల్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ఆసిఫాబాద్
పెద్దవాగు, చిర్రకుంటల నుంచి ఇసుక తవ్వి సవిూపంలో నిల్వ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారని సమాచారం.