కిట్టు హై !.. నగదు నై!! జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకంపై అయోమయం ప్రసూతి మహిళల ఖాతాలలో జమకాని నగదు సంవత్సర కాలంగా డబ్బులు అందని పరిస్థితి 2020 ఏడాదికి సంబంధించి 2021లో నగదు జమ జిల్లాలో ఇప్పటి వరకు 20వేల పైచిలుకు మంది లబ్ధిదారులకు కిట్టుల అందజేత

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి )జూన్‌ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుపై జిల్లాలో అయోమయం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలవుతున్నా.. ప్రసూతి మహిళల ఖాతాలో మాత్రం నగదు జమ చేసే పంపిణీ నిలిచిపోయింది. ఇది నిన్నా.. ఇవ్వాలా.. జరుగుతున్న విషయం కాకుండా, గత యేడాదిన్నర కాలంగా డబ్బులు చేతికందక పోవడంతో అర్హులు ఈ పథకం ఉందా? లేదా? అనే సందేహంలో పడ్డారు. బిడ్డను కన్న తల్లులకు కేసీఆర్‌ కిట్‌తో పాటు నగదు అందజేసేందుకు ప్రారంభమైన ఈ పథకంపై జిల్లాలో నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి మహిళ, ఆమెకు పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు విషయంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్‌ కిట్‌లతో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేల నగదును నాలుగు విడతలుగా ఆ మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఇది గతంలో జరిగిన ముచ్చట. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు అర్హులైన మహిళలు. ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్‌ 4, 2017 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం కిట్ల పంపిణీ మాత్రమే జరుగుతోందని, నగదు పంపిణీ మాత్రం చేయడం లేదంటున్నారు
మసకబారుతున్న పథకం
రాష్ట్రవ్యాప్తంగా ప్రసూతి మహిళల కోసం ప్రారంభించినదే కేసీఆర్‌ కిట్‌ పథకం. ఇది ఎంతో మంది ప్రసూతి మహిళలకు బిడ్డ పుట్టిన వెంటనే ప్రభుత్వ ఆ సుపత్రుల్లో కిట్టు అందజేశారు. అయితే జిల్లాలో యేడాదిన్నర కాలంలో కేసీ ఆర్‌ కిట్‌ నగదు మాత్రం తమ ఖాతాలో జమ కావడం లేదని చెబుతున్నారు. తమకు ఈ పథకం కింద డబ్బుల పంపిణీ నిలిచి పోయిందంటున్నారు. జిల్లాలో గర్భిణి ప్రసవించిన సమయంలో ఫస్ట్‌ యాంటినాటల్‌ చెకప్‌ నుంచి బిడ్డ పుట్టిన తొమ్మిది నెలలలోపు వైద్యం, పౌష్టికాహారం కోసం తీసుకోవాల్సిన పదార్థాల కోసం సర్కారు నగదు ఇచ్చేది. ప్రారంభంలో ఈ పథకం బాగానే ఉన్నా.. తదుపరి కొద్ది కాలం గడిచిన తర్వాత మసక బారుతున్నట్లు ప్రసూతి మహిళలే చెబుతున్నారు. అంతేకాకుండా, అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేసిన ఈ ప్రభుత్వం, గత యేడాదిన్నర కాలం నుంచి కేసీఆర్‌ కిట్‌ నగదు అందక పోవడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు వేలాది మంది తల్లులు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని? ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.550 కోట్ల నిధులను ఖర్చు చేయకుండా నిలిపి వేసిందని అధికార వర్గాల వినికిడి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.10 లక్షల వరకు నిధులు నిలిచి పోయాయంటున్నారు.ప్రసూతి మహిళల ఎదురుచూపులుసర్కారు దవాఖానాల్లో ప్రసవం, తల్లిబిడ్డలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తునప్పుడు.. బాలింతలకు డబ్బులు పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రభుత్వ అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. వారి మా టలను బట్టి చూస్తే కేసీఆర్‌ కిట్‌ పథకం ఇకపై నగదు పంపిణీ జరుగదనే సంకేతం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం కిట్లు మాత్రమే అందజేస్తామని.. ప్రస్తు తం నగదు పంపిణీ నిలిచిపోయిన విషయమే చెప్పకనే చెబుతున్నట్లు ఉంది.ఏఎన్‌ఎంలు, ఆశాలపై తీవ్ర ప్రభావంరాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ నిధులను విడుదల చేయకపోవడంతో ఆ పథకం అమలు, తీరు తెన్నులు పరిశీలిస్తున్న హెల్త్‌ వర్కర్స్‌, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతీ గర్భిణీని పరిశీలిస్తూ నెలనెలా వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న హెల్త్‌, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వారి రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేది కూడా వారే కావడంతో డబ్బులు పంపిణీ జరుగకపోవడంతో వాళ్లనే నిలదీస్తున్న పరిస్థితి ఉంది. మాకు ఎందు కు కేసీఆర్‌ కిట్‌ డబ్బులు జమ కావడం లేదు.. ఏదైనా పొరపాటుగా ఎంటర్‌ చేశారా? అని కొందరు ప్రసూతి మహిళలు, వారి బంధువులు ప్రశ్నిస్తుంటే.. కొన్నిచోట్ల ఆశావర్కర్లే తమకు కేసీఆర్‌ కిట్‌ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి లో పరిస్థితులు ఇలా ఉంటే.. ఈ పథకం కిట్ల పంపిణీ వరకే పరిమితమా? లేక నగ దు జమ చేస్తారా? లేదా? అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు మాకు ఈ తిప్పలు తప్పవంటున్నారు అర్హులైన ఆడబిడ్డలు, తల్లులు.
కిట్టు ఇచ్చారు కానీ నగదు అందలేదు అడిగితే అధికారుల స్పందన లేదు : శారదా బాలింత
నా పేరు శారదా కొండపల్లి గ్రామం గద్వాల ప్రభుత్వ హాస్పత్రిలో నాకు మొదటి కాన్పులో పాప 2020 డిశంబర్ నేలలో ప్రసవం జరిగింది కిట్టు ఇచ్చారు కానీ నగదు ఇంత వరకు అందలేదు
రెండవ కాన్పులో బాబు పుట్టాడు గత 15రోజుల క్రితం ప్రసవం అయ్యింది ఈసారి అదే పరిస్థితి కేసీఆర్ కిట్టు ఇచ్చారు నగదు రెండు కాన్పులవి కలిపి పడతాయాన్నారు ఇంతవరకు రాలేదు అధికారులను అడిగితే వస్తాయి అంటున్నారు కానీ  ఎవరు స్పందించడం లేదు సరైన కారణం చెప్పడం లేదు నాలాంటి బాలింతలు ఎంతో మంది నగదు కోసం ఎదురుచూస్తున్నారు
త్వరలో అందరి ఖాతాలో నగదు జమ అవుతుంది :జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని చందూ నాయక్
2020 సంవత్సరం నుండి ప్రసూతి మహిళల ఖాతాలో నగదు జమ చేసే పంపిణీ నిలిచిపోయిన మాట వాస్తవమే కానీ కరోనా సమయంలో రాష్ట్రం పై ఆర్థిక అదనపు భారం పడటమే దీనికి ప్రధాన కారణం గత బడ్జెట్ లో 443 కోట్లు కేసీఆర్ కిట్ అలాగే నగదు పథకానికి ప్రకటించింది త్వరలో అందరి ఖాతాలలో నగదు విడతలవారీగా తప్పకుండ జమ అవుతుంది