కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే

– 13వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నాం
– పనిచేసే వాళ్లపైనే విమర్శలా?
– నెగిటివ్‌ దోరణులు అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి
– ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యపై సీఎం చంద్రబాబు సవిూక్ష
అమరావతి, మే26(జ‌నం సాక్షి) : ఉద్దానం సమస్యను ప్రభుత్వం ప్రత్యేక పరిగణిస్తుందని, అక్కడ చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ… కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. 13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని, ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక సీకేడీ కేసుల కోసం సోంపేటలో ప్రయోగశాల ఏర్పాటు చేశామని, పనిచేసేవాళ్లపైనే విమర్శలు చేస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నెగటివ్‌ ధోరణులు అభివృద్ధికి నష్టం చేస్తాయన్నారు. గతంలో పవన్‌ కళ్యాణ్‌ చెప్పకముందే సమస్యను గుర్తించామని, పవన్‌ కళ్యాణ్‌ అక్కడికి వెళ్లి సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాక ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యపై మరింత దృష్టిసారించామన్నారు. అన్ని విధాల వారికి సౌకర్యాలు కల్పిస్తున్నామని, వారి ట్రీట్‌మెంట్‌కు అన్ని విధాల ఏర్పాట్లు చేశామని చంద్రబాబు తెలిపారు. అయినా ప్రభుత్వం ఏవిూ చేయలేదు అన్నట్లుగా వ్యవహరించటం సరికాదని చంద్రబాబు సూచించారు.